Uttarakhand: కొండచరియలు విరిగిపడి నలుగురు దుర్మరణం
కొండచరియలు విరిగిపడి నలుగురు మృతిచెందిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ తరుణంలో ఆగస్టు 26 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
కొండచరియలు విరిగిపడటంతో నాలుగు నెలల చిన్నారి సహా నలుగురు దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. గత కొన్ని రోజుల నుచి ఉత్తరాఖండ్ (Uttarakhand), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు (Flash floods) సంభవించాయి. భారీ వర్షాలకు కొండచరియలు (Landslides) విరిగిపడటంతో చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి.
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటం వల్ల నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ నాలుగు నెలల చిన్నారి కూడా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతయ్యారు. చంబా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ట్యాక్సీ స్టాండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడటం వల్ల చాలా వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. డెహ్రాడూన్, పౌరీ, నైనిటాల్, ఛంపావట్, బాగేశ్వర్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం వరకూ హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్టు 26వ తేది వరకూ అసాధారణ వర్షపాతం నమోదవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.