ED Raids Delhi MLA Amanatullah Khan In Money Laundering Probe
ED Raids: 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలతో రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. కొన్ని చోట్ల తాము కూడా బరిలోకి దిగుతామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. ఇంతలో ఆ పార్టీకి షాక్ తగలింది. ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ (Amanatullah Khan) ఇంట్లో ఈడీ (ED) అధికారులు తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా అమానతుల్లా ఖాన్ చేపట్టిన నియామకాలు అక్రమం అని సీబీఐ, ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఆ కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఆప్ ఎమ్మెల్యే మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారనే కోణంలో విచారిస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ సోదాలను ఆప్ నేతలు ఖండించారు.
అమానతుల్లా ఖాన్ ఓక్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈడీ సోదాల నేపథ్యంలో అతని ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరించారు. వక్ఫ్ బోర్డు ఇష్యూకు సంబంధించి గత ఏడాది ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే ఖాన్‌ను అరెస్ట్ చేశారు. అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగం, వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌గా అధికార దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపారు. అధికారాన్ని ఉపయోగించి దాదాపు 32 మందిని అక్రమంగా నియమించారని ఏసీబీ అధికారుల ప్రధాన ఆరోపణ.. ఇందుకోసం నిబంధనలను తుంగలో తొక్కారని అభియోగాలు మోపారు. ఆ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ కూడా ఇచ్చింది.
ఏసీబీ, సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇటీవల ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా 5 రోజుల ఈడీ కస్టడీ విధించింది. లిక్కర్ స్కామ్ గురించి ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వేళ ఆప్ నేతలపై ఈడీ కేసులు కలకలం రేపతున్నాయి. ఇదీ కక్షసాధింపు చర్య అని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు.