ఢిల్లీ మేయర్ ఎన్నికలు రసవత్తరంగా కనిపిస్తున్నాయి. గత నెలలో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు, బీజేపీ 104 సీట్లు, కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకున్నది. శుక్రవారం మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికకు ముందు చోటు చేసుకున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. తొలుత బీజేపీ మేయర్ పదవికి దూరంగా ఉందామని భావించినప్పటికీ, చివరకు మేయర్, డిప్యూటీ మేయర్ కోసం పోటీ పడుతోంది. ఢిల్లీ మేయర్ పదవి అయిదేళ్లలో ఏడాదికి ఒకసారి మారుతుంది. మొదటి ఏడాది మహిళలకు రిజర్వ్ చేయగా, రెండో ఏడాది ఓపెన్ కేటగిరీ, మూడో ఏడాది రిజర్వ్డ్ కేటగిరీ, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్ కేటగిరీ కింద మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత నెల రోజులకు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎననుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుండి మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్, బీజేపీ నుండి షాలిమర్ బాగ్ కౌన్సిలర్ రేఖా గుప్తా బరిలో నిలిచారు. డిప్యూటీ మేయర్ పదవికి ఏఏపీ నుండి ముహమ్మద్ ఇక్బాల్, జలజ్ కుమార్, బీజేపీ నుండి కమల్ బాగ్రి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికకు కాంగ్రెస్ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. బీజేపీ, ఏఏపీ తమకు ప్రతిపక్షాలుగా ఉండటంతో, కేవలం 9 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వడం లేదు.
మేయర్ ఎన్నికలకు రెండు రోజుల ముందు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పదిమంది ఆల్డర్మెన్ను నియమించారు. ఇలా నియమించడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తప్పుబట్టారు. కానీ రాజ్ నివాస్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ యాక్ట్ 1957 మేరకు అడ్మినిస్ట్రేటర్ 10 మందిని నామినేట్ చేయవచ్చు. సవరించిన గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టం కూడా ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నర్ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ పదిమంది ఆల్డర్మెన్ను నామినేట్ చేశారు.
అలాగే, నేడు జరిగే కౌన్సిల్ మొదటి సమావేశానికి ప్రొటెం స్పీకర్ లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్గా బీజేపీ కౌన్సిలర్ సత్యశర్మను గురువారం నియమించారు.
ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో కేవలం 250 మంది కౌన్సిలర్లు మాత్రమే ఓటు వేస్తారనుకుంటే పొరపాటు. వీరితో పాటు 14 మంది ఢిల్లీ ఎమ్మెల్యేలు, 7గురు లోకసభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు మేయర్ ఓటింగ్లో పాల్గొంటారు. మేయర్ ఎన్నిక కూడా సీక్రెట్ బ్యాలెట్ రూపంలో జరుగుతుంది. ఏ కౌన్సిలర్ అయినా ఏ పార్టీకి అయినా ఓటు వేయవచ్చు. అది వారి ఇష్టం. ఈ విషయంలో యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. అందుకే ఏఏపీ నుండి పలువురు కౌన్సిలర్లు తమకు ఓటు వేస్తారని బీజేపీ భావిస్తోంది.