గుజరాత్ లో జూనియర్ క్లర్క్ నియామక పరీక్షను అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పరీక్షకు రెండు గంటల ముందు హైదరాబాద్ లో పేపర్ లీక్ అయిందని అధికారులు గుర్తించారు. ఈ ప్రశ్నాపత్రాన్ని హైదరాబాద్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రించినట్లు గుర్తించి, ప్రెస్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరో రెండు గంటల్లో జరగబోయే పరీక్ష కోసం పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్న అభ్యర్థులు పరీక్ష వాయిదా పడ్డ విషయం తెలిసి ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ వ్యాప్తంగా ఈ పరీక్ష రాసేందుకు 9.50 లక్షల మంది నిరుద్యోగులు సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో పేపర్ లీక్ కావడం, పరీక్షను అధికారులు వాయిదా వేయడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, పేపర్ లీక్ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని, త్వరలోనే నియామక పరీక్షను నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.