యూపీ-ఉత్తరాఖండ్ (Uttarakhand) సరిహద్దుల్లో వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు వరదల్లో చిక్కుకుపోయింది.యూపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు రూపెదిహా నుంచి హరిద్వార్ (Haridwar) వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో బస్సు (BUS) ముందుకెళ్లలేకపోయింది. తమను కాపాడాలంటూ ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. బస్సును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
అక్కడకు చేరుకున్న పోలీసులు జేసీబీ మిషన్ల (JCB Missions) సాయంతో ప్రయాణికులను రక్షించారు. ఆ తర్వాత బస్సును కూడా వరద నుంచి బయటకు తీసుకొచ్చారు. ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారని పోలీసులు వెల్లడించారు.భారీ వర్షాల (Heavy Rains)తో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. నదులు ఉప్పొంగి వరదలు రావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.