»Bjps Fourth List For Lok Sabha Elections Released
BJP: బీజేపీ నాలుగో జాబితా విడుదల
బీజేపీ నాలుగో జాబితా విడుదల చేసింది. సినీనటి రాధికకు ఎంపీ టికెట్ ప్రకటించింది. ఇప్పటికే మూడు విడతలుగా 275 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన బీజేపీ.. ఇప్పుడు నాలుగో విడత అభ్యర్థులను ప్రకటించింది.
BJP's fourth list for Lok Sabha elections released
BJP: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో BJP జోరు పెంచింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తోంది. ఇప్పటికే మూడు విడతలుగా 275 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన బీజేపీ.. ఇప్పుడు నాలుగో విడత అభ్యర్థులను ప్రకటించింది. నాలుగో విడతలో 15 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ముఖ్య నేతలతో పాటు.. ఓ సినీ తారకు కూడా టిక్కెట్ దక్కింది. బీజేపీ తన నాలుగో విడత జాబితాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రముఖ హీరోయిన్ రాధికకు ఎంపీ సీటు ఇచ్చింది బీజేపీ. విరుధునగర్ నుంచి ఆమెను ఎన్నికల బరిలో నిలపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. అదే విధంగా తమిళనాడులోని చిదంబరం లోక్సభ స్థానం నుంచి కాత్యాయినిని బరిలో దింపేందుకు బీజేపీ నిర్ణయించింది. కాత్యాయిని 2017 వరకు అన్నాడీఎంకే పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. అధిష్టానం పెద్దలకు తమపై నమ్మకం కుదిరేలా తన పనితీరును మెరుగుపరుచుకు వచ్చారు.
బీజేపీ మొదట 195 మందితో తొలి జాబితా, కొన్ని రోజుల క్రితం 72 మందితో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ.. ఇటీవలే 9 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతం మరో 15 మందితో నాలుగో జాబితాను ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 291 స్థానాల్లో కాషాయ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. లోక్సభ ఎన్నికలు మొత్తంగా 543 స్థానాలకు ఏడు దశల్లో జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభం కానున్నాయి. చివరి దశ అయిన 7వ విడత ఎన్నికలు జూన్ 1న జరగనున్నాయి. ప్రస్తుతం అన్ని పార్టీలు జోరు పెంచాయి. ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి.