»Bank Transaction Beyond Rs 1 Lakh Suspicious Under Ec Eyes
EC : బ్యాంకుల్లో లక్షకు మించి వేసినా, తీసినా ఆరా!
సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాలపై ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. లక్షకు మించి వేసి, తీసే లావాదేవీలపై కన్నేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Bank transaction beyond Rs 1 lakh : అన్ని బ్యాంకుల్లోనూ లక్ష రూపాయలకు మించి వేయడం, తీయడం చేసే వారి లావాదేవీలపై ఇకపై ఎన్నికల సంఘం కన్నేయనుంది. వారి లావాదేవీలపై ఆరా తీయనుంది. ఇదే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం(EC) బ్యాంకులకు లేఖ రాసింది. ఎన్నికల సమయంలో డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకు అధికారుల్ని కోరింది.
జిల్లా ఎన్నికల అధికారులు సైతం ఈ విషయంలో కన్నేసి ఉంచాలని తెలిపింది. స్థానికంగా ఉన్న అన్ని బ్యాంకుల నుంచి రూ. లక్షకు మించి లావాదేవీలు జరిపే వివరాలన్నింటినీ స్థానిక ఎన్నికల అధికారులు తెప్పించుకోవాలని చెప్పింది. వాటిని విశ్లేషించే బాధ్యతను సంబంధిత సిబ్బందికి అప్పగించాలని తెలిపింది.
ఎన్నికల నేపథ్యంలో ఒకే ఖాతా నుంచి వేరు వేరు బ్యాంకు ఖాతాలకు డబ్బులు ట్రాన్సవర్ అవుతున్నట్లు తమ దృష్టికి వస్తున్నాయని ఈసీ (EC) తెలిపింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వివిధ మార్గాల ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగే అవకాశాలు ఉన్నాయంది. అందుకనే లక్షకు మించి జరిపే లావాదేవీలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. రూ.10లక్షలకు మించిన నగదు ఉపసంహరణ లేదా డిపాజిట్లపైనా నిఘా ఉంటుందని తెలిపింది.