Bihar : నిర్మాణంలో కుప్పకూలిన… దేశంలోనే అతి పెద్ద వంతెన!
బిహార్‌లో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కుప్పకూలింది. నిర్మాణం పూర్తయితే ఇది దేశంలోనే అతి పెద్ద వంతెనగా రికార్డులకెక్కనుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Bridge Collapsed In Bihar : నిర్మాణంలో ఉన్న అతి పెద్ద వంతెన ఒకటి బిహార్‌లో కుప్పకూలిపోయింది. మన దేశంలోనే అతి పెద్ద వంతెన ప్రాజెక్టు ఇది. నిర్మాణ సమయంలో పిల్లర్లపై గర్డర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో మూడు గర్డర్లు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మరి కొందరు శిధిలాల కింద ఉన్నట్లు సమాచారం. స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు మొదలయ్యాయి. 10.2 కిలో మీటర్లు పొడవు ఉండే ఈ వంతెన పూర్తయితే దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జిగా అవతరిస్తుంది. దీన్ని బాకూర్ బ్రిడ్జ్‌గా(BAKOUR BRIDGE) పిలుస్తున్నారు.
శుక్రవారం ఉదయం ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బిహార్‌లోని(BIHAR) సుపాల్ జిల్లాలో ఈ అతి పెద్ద వంతెనను నిర్మిస్తున్నారు. ఈ ఘటనలో పదిహేను నుంచి 20 మంది గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిని స్థానికులు బైక్ లపై తీసుకెళ్లి ఆసుపత్రుల్లో చేర్చారు. అయితే మృతులు, గాయపడిన వారి వివరాలపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
బ్రిడ్జ్ నాణ్యతపై స్థానికుల్లో ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎవరైనా దీని నాణ్యత బాలేదని ఫిర్యాదులు చేస్తే వారి ఇంటి మీదకి నిర్మాణ సంస్థ పోలీసులను పంపేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో తామంతా ఇక మాట్లాడటం మానేశామని అంటున్నారు. ఇంత సంఘటన జరిగి, ఇందరు గాయపడితే కంపెనీ వ్యక్తులు ఒక్కరు కూడా రాలేదని వారు చెబుతున్నారు. దీంతో క్షతగాత్రుల్ని తామే బైక్‌లపై ఆసుపత్రులకు చేర్చామని అంటున్నారు.