AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పోలింగ్ శాతం వస్తుందని వార్తలు వస్తున్నప్పటికీ ఎంత అనే దానిలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఈసీ సీఈఓ ఈ విషయమై అధికారికంగా ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో మే 13న జరిగిన ఎన్నికల్లో ఏకంగా 81.17 శాతం పోలింగ్( POLLING) నమోదైందని తెలిపింది. గత ఎన్నికలతో పోలిస్తే అది 1.60 శాతం మేర ఎక్కువని వెల్లడించింది. దీనిలో పోస్టల్ ఓట్లు 1.10 శాతం ఉన్నాయని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శాసన సభ నియోజకవర్గాల్లోనూ సరాసరిన 80.07 శాతం పోలింగ్( POLLING) నమోదు అయ్యింది. జిల్లాల వారీగా అత్యధికంగా ప్రకాశం(87.09), పల్నాడు( 85.65), బాపట్ల( 84.98)లో పోలింగ్ శాతం నమోదు అయినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63 శాతం మాత్రమే నమోదు అయినట్లు తెలిపింది.
ఇక సరాసరిన చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 81.17 శాతం పోలింగ్ నమోదైంది. ఏపీలో మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 3.35 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. ఇక ఎన్నికల తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించినట్లు వెల్లడించింది. వాటి లెక్కింపు జూన్ 4న జరగనున్న విషయం అందరికీ తెలిసిందే.