Pawan Kalyan: జనసేనకు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తు ఖరారు చేసిన ఈసీ
ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసైనికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈసీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని ఏపీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. దీంతో జనసేన కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. పలుచోట్ల సంబరాలు చేసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు పవరేంటో చూపిస్తామన్నారు.
గత సార్వత్రిక ఎన్నికలు, ఈ మధ్యనే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. మరోసారి ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు ఆ గుర్తుపైనే పోటీ చేయడానికి సిద్దమయ్యారు. గాజు గ్లాసు గుర్తు తమకు ఎంతో ప్రత్యేకమైందని జనసైనికులు ఆనందం వ్యక్తం చేశారు.
జనసేన గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై ఉత్తర్వు కాపీలను పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్ బుధవారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అందించారు. మంగళగిరి కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కు ఈసీ ఉత్తర్వు ప్రతులను అందించారు. ఈ సందర్భంగా పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఈసీ అధికారులకు, సిబ్బందికి పవన్ ధన్యవాదాలు తెలియజేశారు.