Ayodhya Bala Ram : అయోధ్య బాల రాముడికి తెలుగు వారి చేనేత వస్త్రాలను అలంకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి. లెనిన్, ఇకత్ లాంటి వాటిని సందర్భానుసారంగా చేనేతతో తయారు చేసి అక్కడి వారు గుర్తింపు పొందారు. అయితే ఇప్పుడు గత ఆదివారం దుబ్బాక(Dubbaka) చేనేత కళాకారులు నేసిన పింక్ కలర్ లెనిన్ ఇక్కత్ వస్త్రాన్ని రాముల వారికి అలంకరించారు.
వారం రోజుల పాటు రోజుకో రంగులో ఉండే వస్త్రాలు కావాలని దిల్లీకి చెందిన డిజైనర్ మనీశ్ త్రిపాఠి దుబ్బాక హ్యాండ్లూమ్స్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. ఆయన అయోధ్య బాల రాముడి వస్త్రాలను డిజైన్ చేస్తుంటారు. ఆయన ఆర్డర్‌తో లెనిన్ ఇక్కత్(Linen Ikat) చేనేత వస్త్రాలను తాము అయోధ్యకు పంపించామని దుబ్బాక హ్యాండ్లూమ్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బోడ శ్రీనివాస్ వెల్లడించారు. తాము పంపించిన వస్త్రాలను బాల రాముడికి ఆదివారం మొదలుగొని అలంకరిస్తుండటంతో తమకు చాలా సంతోషంగా ఉందన్నారు.
ప్రస్తుతం తాము వారికి రెండు వస్త్రాలను పంపించామని మరో ఐదు వస్త్రాలను పంపించనున్నామని బోడ శ్రీనివాస్ సోమవారం వెల్లడించారు. గత ఫిబ్రవరిలో దిల్లీలో కేంద్ర చేనేత, ఔళి శాఖ ఆధ్వర్యంలో ఓ చేనేత వస్త్ర ప్రదర్శన జరిగింది. అక్కడ దుబ్బాక వస్త్రాలు సైతం కొలువుదీరాయి. పలువురి ప్రశంసలను అందుకున్నాయి. అక్కడ తమ వస్త్రాల క్వాలిటీ నచ్చే ఇలాంటి ఆర్డర్ తమ కంపెనీకి వచ్చిందని ఆయన తెలిపారు. ఏదేమైనా బాల రాముడికి తమ వస్త్రాలను అలంకరించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.