Antarctica : అంటార్కిటికా నుంచి వేరైన భారీ మంచుకొండ, హైదరాబాద్లో సగం కంటే పెద్దదే!
అంటార్కిటికా ఖండంలో భారీ మంచు కొండ ఒకటి నుంచి దాని నుంచి వేరైపోయింది. దీనికి శాస్త్రవేత్తలు ఏ-83గా పేరు పెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
Antarctica : మంచు ఖండం అంటార్కిటికా(Antarctica ) నుంచి భారీ మంచు కొండ ఒకటి వేరైపోయింది. 380 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఈ కొండ దగ్గర గతంలో పగుళ్లు ఏర్పడ్డాయి. ఆ ఫలితంగా అది ఇప్పుడు ఆ ఖండం నుంచి పూర్తిగా వేరై పోయింది. హైదరాబాద్ నగరం దాదాపుగా 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అంటే హైదరాబాద్లో సగం విస్తీర్ణానికి మించి ఈ మంచు కొండ విస్తీర్ణం ఉందన్నమాట.
మే 20వ తారీఖున ఈ మంచు కొండ వేరు పడటం మొదలు పెట్టిందని సైంటిస్టులు చెబుతున్నారు. మే 22వ తారీఖు నాటికి పూర్తిగా విడిపోయిందని తెలిపారు. కోపర్నికస్ సెంటినల్ – 1 శాటిలైట్ నుంచి దీనికి సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. ఈ విడిపోయిన మంచు కొండకు ఏ-83 అంటూ నామకరణం చేశారు. ఈ రాడార్ చిత్రాల్లో చూసినట్లైతే ఇది త్రిభుజాకారంలో ఉన్నట్లు తెలుస్తోంది.
అంటార్కిటికా(Antarctica ) ఖండంలో ఇలా మంచు కొండలు చీలి విడిపోవడం గత నాలుగేళ్లలో ఇది మూడో సారి. మెక్ డానాల్డ్ ఐస్ రంపెల్స్ అని పిలిచే ఓ ప్రాంతంలో మంచు కరగడం వల్లే ఇలా మంచు కొండలు విడిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ ఖండంలో వస్తున్న వాతావరణ మార్పులే ఈ చీలికలకు కారణం అవుతున్నాయని అంటున్నారు.