West Bengal: దారుణం.. 24 గంటల్లో 9 మంది నవజాత శిశువులు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిలో 9 మంది నవజాత శిశువులు మరణించారు. గత 24 గంటల్లో 9 మంది చనిపోవడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఆస్పత్రిలో మరికొంత మంది శిశువుల పరిస్థితి ప్రమాదంలో ఉంది. ఒక్కో మంచంపై ముగ్గురు శిశువులను ఉంచి వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
గత 24 గంటల్లో 9 మంది నవజాత శిశువులు (New born Babies) మరణించారు. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ (Mursidabad) జిల్లా మెడికల్ కాలేజీ ఆస్పత్రి వద్ద చోటుచేసుకుంది. ఆస్పత్రిలో మరికొంత మంది నవజాత శిశువుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం. ఒకేసారి ఇంత మంది శిశువులు చనిపోవడంతో పశ్చిమ బెంగాల్ ఆరోగ్యశాఖపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఆస్పత్రి వద్ద బాధితుల రోదనలు మిన్నంటాయి. ఆస్పత్రి నిర్లక్ష్యమే చిన్నారుల మరణానికి కారణమని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
ముర్షిదాబాద్ జిల్లాలో పిల్లలకు సంబంధించిన చాలా ఆస్పత్రులు ఉన్నాయి. జంగీపూర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా అతి పెద్ద చిన్న పిల్లల ఆస్పత్రిగా ఉంది. ఈ ప్రైవేటు ఆస్పత్రులతో ప్రతి రోజూ భారీ సంఖ్యలో చిన్నారులను చికిత్స నిమిత్తం అడ్మిట్ చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే చిన్నారులకు కూడా ఇక్కడే చికిత్స అందిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రైవేటు ఆస్పత్రులలో శిశువుల హెల్త్ కండీషన్ క్రిటికల్‌గా ఉంటే వారిని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీకి ఆస్పత్రి రిఫర్ చేస్తూ ఉంటుంది.
ప్రైవేటు ఆస్పత్రులన్నీ ఇలా ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి నవజాత శిశువులను రిఫర్ చేయడం వల్ల ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి పెరుగుతోంది. ఒక్కసారిగా భారీ సంఖ్యలో శిశువులను ఆస్పత్రికి తీసుకురావడం వల్ల కొంత ఇబ్బంది అనేది నెలకుంటుంది. ఈ మెడికల్ ఆస్పత్రిలో కూడా 52 పడకలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం అవి చాలడం లేదని ఆస్పత్రి యంత్రాంగం చెబుతోంది.
ఇప్పుడున్న పరిస్థితిలో ఒక్కో బెడ్‌పై 3 పిల్లలను ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. ఆస్పత్రిలో 100 మందికి పైగా పిల్లలు చికిత్స పొందుతున్నారని ఆస్పత్రి ప్రిన్సిపాల్ అమిత్ దాన్ వెల్లడించారు. 9 మంది నవజాత శిశువులు మరణించడంపై ఇప్పటికే ఒక కమిటీని వేశామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.