గుజరాత్ సంప్రదాయ నృత్యం అయిన గర్బాకు అరుదైన గౌరవం దక్కింది. గర్బా డ్యాన్స్‌కు యునెస్కో గుర్తింపు లభించింది. నవరాత్రి సందర్భంగా గుజరాత్ లోని ప్రతి వీధిలో గర్బా నృత్యం చేయడం సంప్రదాయంగా వస్తోంది. నవరాత్రుల రోజుల్లో గర్బా నృత్యం వాడవాడలా కనువిందు చేయనుంది. గుజరాత్ లోనే కాకుండా నవరాత్రుల రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ నృత్యం కనిపించడం విశేషం.
అటువంటి ప్రత్యేకత ఉన్న గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు లభించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెల్లడించారు. గర్బా రూపంలో మాతృమూర్తికి అంకితం చేసే పురాతన సంప్రదాయానికి ఆదరణ మరింత పెరుగుతోందని సీఎం తెలిపారు. సాంస్కృతిక వారసత్వ జాబితా కింద గుజరాత్‌కు గుర్తింపుగా గర్బాను యునెస్కో ఆమోదించిందని ట్విట్టర్ ద్వారా పటేల్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుజరాతీలకు ఈ గర్బా నృత్యం గర్వకారణమని అన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ వారసత్వ సంపదకు ప్రాముఖ్యత ఇవ్వడం, ఆ వారసత్వాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడం గొప్ప విషయమని సీఎం భూపేంద్ర పటేల్ కొనియాడారు. ఈ సందర్భంగా గుజరాత్ ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు. గర్భా నృత్యానికి యునెస్కో గుర్తింపు లభించడంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. మోదీ మాట్లాడుతూ..వారసత్వాన్ని సంరక్షించుకోవడానికి, భవిష్యత్తు తరాలకు అందించడానికి యునెస్కో గుర్తింపు తమకు స్ఫూర్తినిస్తోందన్నారు. గుజరాత్ ప్రజలకు, గర్భా ప్రియులకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు.