ఓ వ్యక్తి తమ ప్రాంతంలో వర్షం కురవకపోవడానికి గల కారణం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్3 అనుకున్నాడు. వెంటనే దేవుడితో మాట్లాడి వర్షాలు ఎందుకు కురవడం లేదో కనుక్కోవాలని ప్రభుత్వానికి లేఖ రాశాడు.
చాలా మందికి సమాచార హక్కు చట్టం గురించి తెలియదు. కొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. ఆర్టీఐ యాక్ట్ ద్వారా ప్రభుత్వం నుంచి మనకు కావాల్సిన సమాచారాన్ని ఈ పద్ధతిలో తెలుసుకోవచ్చు. తాజాగా ఓ వ్యక్తి ఆర్టీఐకి దరఖాస్తు చేసుకున్న లేఖ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దేవుడితో మాట్లాడి వానలు ఎప్పుడొస్తాయో తెలియజేయాలని ఆ లేఖ ద్వారా ప్రభుత్వానికి అభ్యర్థించాడు. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీహార్ రాష్ట్రంలోని గౌరబౌరమ్ జిల్లా మహౌర్ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ ఆర్టీఐ కార్యకర్తగా ఉంటున్నాడు. వర్షాకాలం మొదలై చాలా వారాలు గడుస్తున్నప్పటికీ తమ రాష్ట్రంలో మాత్రం సరిగ్గా వర్షాలు కురవడం లేదని, ఉక్కపోతలు అధికంగా ఉన్నాయని విసుగుచెంది ఆర్టీఐకి లేఖ రాశాడు. అసలు వర్షాలు కురవకపోవడానికి గల కారణమేంటో తెలియజేయాలని భూ విజ్ఞాన శాఖకు ఆర్టీఐ యాక్ట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు.
వర్షం కురవకపోవడానికి గల కారణాన్ని దేవుడిని అడిగి తెలుసుకోవాలని, ఈ మధ్యనే ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్3 అందుకేమైనా ఉపయోగపడుతుందేమో పరిశీలించాలని కోరాడు. ప్రజ్ఞాన్ రోవర్కు అమర్చిన అధునాతన పరికరాల వల్లే ప్రకృతి స్తంభించిపోయే ఉంటుందా? అని అనుమానం కూడా వ్యక్తం చేశాడు. వాతావరణంలో గల మార్పులకు కారణం ఏంటో దేవుడిని అడిగి తెలుసుకుని చెప్పాలని కోరాడు. ప్రస్తుతం రాజ్ కుమార్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.