Alappuzha Municipality. A disease prevalent in Kerala
కేరళ(Kerala) రాష్ట్రంలో మరో వింత వ్యాధి వెలుగులోకి వచ్చింది. కేరళలోని అలప్పుజా జిల్లాలో ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్(Primary amoebic meningoencephalitis) అనే ఒక వింత వ్యాధి కేసు నమోదైంది. పనవల్లికి చెందిన 15 ఏళ్ల బాలుడు ఈ వ్యాధితో బాధపడుతూ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ వ్యాధి గతంలో ఒక సారి కలకలం సృష్టించింది. 2017లో మొదటిసారిగా అలప్పుజా మున్సిపాలిటీ(Alappuzha Municipality) ప్రాంతంలో ఈ వ్యాధి నమోదైంది. కొంతకాలం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఆ తర్వాత మళ్లీ ఇన్ని సంవత్సరాలకు ఈ వ్యాధి వెలుగులోకి వచ్చింది. పరాన్నజీవి లేకుండా నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీబా తరగతికి చెందిన వ్యాధికారక క్రిముల ద్వారా ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కాలువలు, చెరువులు వంటి మురికి నీళ్లలో స్నానం చేయడం ద్వారా ముక్కు, నోరు, చర్మంలోని స్వేదగ్రంధుల ద్వారా ఈ క్రిములు మానవ శరీరంలోకి ప్రవేశించి మెదడును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఫలితంగా జ్వరం, తలనొప్పి, వాంతులు, మైకము ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా వైద్యులు నిర్ధారించారు.
అయితే వర్షాకాలంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కలుషిత నీటితో స్నానం చేయడం, మీ ముఖం, నోటిని అపరిశుభ్రమైన నీటితో కడగడం మానుకోవాలి. ఈ వ్యాధికి కారణమైన సూక్ష్మజీవులు ఇలాంటి నీటిలోనే ఎక్కువగా జీవిస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వర్షాకాలంలో ప్రవహించే నీళ్లు, కాలువలలో స్నానం చేయడం మంచిది కాదు. అలాగే ఈ వర్షాకాలంలో కాచీ వడబోసిన నీటిని సేవించడం, ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తినడం వంటి జాగ్రత్తలతో పాటు మన ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా ఉండేలా చూసుకోవాలని సంబంధిత అధికారులు, స్థానిక ఆస్పత్రి డీఎంఓ తెలియజేశారు.