గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వరుసగా ఏడోసారి అధికారం నిలబెట్టుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటా పోటీ కనిపిస్తోంది. ఏ పార్టీ అధికారం దక్కించుకున్నా అది రెండు మూడు స్థానాల తేడాతోనే ఉండే అవకాశముంది. కానీ గుజరాత్లో మాత్రం బీజేపీకి ఎదురు లేకుండా పోయింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇక్కడ డబుల్ డిజిట్ వచ్చే పరిస్థితి లేదు. పోస్ట్ పోల్ సర్వే ఫలితాలు నిజం చేస్తూ ఎనిమిది స్థానాలకు అటు ఇటుగా ఆధిక్యతతో ఉంది. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి పోస్ట్ పోల్ సర్వేలు కాస్త మిస్ అయ్యాయి. ఎక్కువ సర్వేలు బీజేపీకి 130 వరకు, కాంగ్రెస్కు 40 నుండి 70 వరకు వస్తాయని వెల్లడించాయి. కానీ ఇక్కడి 182 స్థానాలకు గాను బీజేపీ 140 స్థానాలకు పైగా గెలుచుకుంటుండగా, కాంగ్రెస్ 20 స్థానాలకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ గత ఎన్నికల కంటే దిగజారిపోయిందని చెప్పవచ్చు.
గుజరాత్లో బీజేపీ అద్భుత విజయం సాధించడంతో పాటు వరుసగా ఏడోసారి గెలిచి సరికొత్త రికార్డును సాధిస్తోంది. స్వతంత్ర భారతంలో వరుసగా ఏడు పర్యాయాలు గెలిచిన రెండో పార్టీ బీజేపీ అవుతుంది. అంతకుముందు పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPM-మార్క్సిస్ట్) పశ్చిమ బెంగాల్లో 1977 నుండి 2011 వరకు వరుసగా ఏడుసార్లు విజయ ఢంకా మోగించింది. ఏ పార్టీ కూడా ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇన్ని పర్యాయాలు గెలవలేదు. ఇప్పుడు గుజరాత్లో బీజేపీ 7వసారి విజయం సాధించినట్లుగా ఫలితాల సరళి వెల్లడిస్తోంది. బెంగాల్లో సీపీఐ తర్వాత ఇప్పుడు గుజరాత్లో బీజేపీ మాత్రమే ఇప్పటి వరకు వరుసగా ఏడుసార్లు గెలిచిన పార్టీగా నిలుస్తున్నాయి. బీజేపీ ఇక్కడ 27 ఏళ్లుగా అధికారంలో ఉంది.
బీజేపీ మరో రికార్డ్ దిశగా కూడా కనిపిస్తోంది. ఇక్కడ 1985లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 149 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత ఏ పార్టీ కూడా ఇన్ని స్థానాలు దక్కించుకోలేదు. కానీ ఈసారి బీజేపీ 140 అంతకుమించి స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 150 సీట్లు వస్తే మాత్రం కాంగ్రెస్ రికార్డును బద్దలు కొట్టినట్లే. లేదంటే కనీసం ఆ మార్కుకు చేరువలో నిలవవచ్చు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 50 శాతానికి పైగా ఓటింగ్ శాతం పొందవచ్చు. అంటే మెజార్టీ సీట్లు మాత్రమే కాదు, మెజార్టీ ఓట్లు కూడా రానుండటం గమనార్హం. ఇది కూడా మరో రికార్డ్. కాంగ్రెస్ పార్టీకి 25 శాతానికి పైగా, ఆమ్ ఆద్మీ పార్టీకి 12 శాతానికి పైగా ఓట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని, గరిష్ట సీట్లను గెలుచుకోవడంతో పాటు, అధిక శాతం ఓట్లను తాము దక్కించుకుంటామని గుజరాత్ మంత్రి, బీజేపీ సూరత్ వెస్ట్ అభ్యర్థి పుర్నేష్ మోడీ అన్నారు. తమ పార్టీకి చెందిన ఎక్కువ మంది అభ్యర్థులు ప్రత్యర్థుల కంటే చాలా ముందు ఉన్నారన్నారు. గెలుపు దాదాపు ఖాయం కావడంతో అప్పుడే బీజేపీ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇక గుజరాత్ కీలక యువనేతలు హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవానీ, అల్పేష్ ఠాకూర్ వెనుకంజలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే పోటా పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ 33 స్థానాల్లో, బీజేపీ 31 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 35 సీట్లు కావాలి. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు తక్కువగా వచ్చినా, గెలిచిన నలుగురైదుగురు స్వతంత్రులను అమిత్ షా దరి చేర్చుకొని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి.