Rules Ranjan: ‘రూల్స్ రంజన్’ ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
సెప్టెంబర్ నెలలో వరుసపెట్టి థియేటర్లోకి రాబోతున్నాయి తెలుగు సినిమాలు. కాకపోతే సలార్ సినిమా వాయిదా పడడంతో రిలీజ్ డేట్స్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'సలార్' ప్లేస్‌లో కొత్త సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో బడా బడా సంస్థలు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాయి. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఇంట్రీ ఇచ్చిన కిరణ్.. ఆ తర్వాత వెంటనే ఎస్ఆర్ కళ్యాణ మండపంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాతే రేసులో వెనకబడిపోయాడు. సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణుకథ సినిమాలతో ఆకట్టుకోలేకపోయాడు. దాంతో కిరణ్ జడ్జ్మెంట్ ఇలా ఉందేంటి.. అనే డౌట్స్ వచ్చాయి. అయితే ఈసారి మాత్రం మనోడు హిట్ కొట్టేలానే ఉన్నాడు. కిరణ్ అబ్బవరం లేటెస్ట్ ఫిల్మ్ రూల్స్ రంజన్.
డీజే టిల్లు బ్యూటి నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రూల్స్ రంజన్ ట్రైలర్ విడుదల చేశారు. సుమారు 2 నిమిషాల 44 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఫుల్ ఫన్ మోడ్‌లో ఉంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయినా రంజన్‌ను అంతా రూల్స్ రంజన్ అని పిలుస్తారు. అలాంటి వ్యక్తికి గతంలో దూరమైన అమ్మాయి మళ్లీ కలవడంతో.. రంజన్ జీవితం ఎలా మలుపు తిరిగింది? వంటి కథాంశంతో లవ్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూల్స్ రంజన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ముఖ్యంగా వెన్నెల కోశోర్, హైపర్ ఆది, వైవా హర్ష డైలాగ్స్ కడుపుబ్బ నవ్వించేలా ఉన్నాయి. ఈ సినిమాలో నేహాశెట్టితో పాటు మెహర్ చాహల్ మరో హీరోయిన్గా నటించింది. మొత్తంగా రూల్స్ రంజన్ ట్రైలర్ చూస్తుంటే.. బాబు హిట్ కొట్టేలానే ఉన్నాడు. ఏం ఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు.