Rudrangi Full Movie Review: జగపతిబాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్ లీడ్ రోల్ పోషించిన రుద్రంగి (Rudrangi) సినిమా ఈ రోజు విడుదలైంది.
మూవీ: రుద్రంగి నటీనటులు: జగపతిబాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, గణవి లక్ష్మణ్, ఆర్ఎస్ నందా తదితరులు ఎడిటింగ్:బొంతల నాగేశ్వర్ రెడ్డి సినిమాటోగ్రఫీ: సంతోష్ షానమోని సంగీతం: నవ్ఫాల్ రాజా నిర్మాత: డాక్టర్ రసమయి బాలకిషన్ రచన, దర్శకత్వం:అజయ్ సామ్రాట్ విడుదల తేదీ: జూలై 7, 2023
కథ:
మల్లేష్ (ఆశిష్ గాంధీ) రుద్రంగి (గణవి లక్ష్మణ్) బావా మరదళ్లు. వీరికి పేరంట్స్ చిన్నప్పుడే చనిపోగా.. తాత వద్ద పెరుగుతారు. వారి అన్యోన్యత చూసి చిన్నప్పుడే మల్లేష్ చేత రుద్రంగి మెడలో తాళి కట్టిస్తాడు. తర్వాత తాతను ఊరి దొర పిలువగా.. రానని చెబుతాడు. దీంతో ఈడ్చుకొని తీసుకెళ్లి.. కొట్టి చంపేస్తారు. దీంతో దొరపై మల్లేష్ ఎదురుతిరుగుతాడు. తర్వాత దొర నుంచి ప్రాణ భయం ఉండటంతో రుద్రంగిని తీసుకొని వెళతాడు. అలా వెళ్లే సమయంలో మరో దొర భీమ్రావ్ దేశ్‌ముఖ్ (జగపతిబాబు)పై హత్యా ప్రయత్నం జరుగుతుంది. దాని నుంచి మల్లేష్ కాపాడి.. అక్కడే ఉంటాడు. దొర అనే అహంకారంతో కనిపించిన ఆడదానిని పాడు చేస్తుంటాడు. జ్వాలాబాయ్ దేశ్‌ముఖ్ (మమతా మోహన్‌దాస్)ను రెండో పెళ్లి చేసుకుంటాడు. రెండో భార్యతో సఖ్యంగా ఉండడు. దీంతో ఆమె మల్లేష్ మీద మనసు పడుతుంది. అయినప్పటికీ అతను కాదంటాడు. దొర రుద్రంగిని చూసి మోహించి.. పిచ్చివాడు అవుతాడు. ఆమెను తీసుకొని రావాలని మల్లేష్‌ను పంపించగా.. వెళ్లి వచ్చి ఆమె తన భార్య అని చెబుతాడు. తనకు కావాలని చెప్పగా.. మల్లేష్ ఎదురుతిరుగుతాడు.
ఎలా సాగిందంటే..
రుద్రంగి కథ 1947 సమయంలో జరిగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ.. భారతదేశంలో విలీనం చేసేందుకు నిజాం రాజు అంగీకరించలేని సంగతి తెలిసిందే. ఆ సమయంలో జరిగిన ఘటనను దర్శకుడు తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ చూసిన సమయంలోనే క్లైమాక్స్ అర్థం అవుతుంది. ఇంటర్వెల్ ముందుకు వచ్చేసరికి అసలు పాయింట్లోకి వస్తాడు. గడీలను పడగొట్టి బడులుగా మార్చాలనేది అసలు చెప్పాలనుకున్న పాయింట్.
ఎవరెలా చేశారంటే..?
తెలంగాణ దొరల ఆగడాలను చక్కగా తెరకెక్కించారు దర్శకుడు అజయ్ సామ్రాగ్. జగపతి బాబు (భీమ్ రావ్) పాత్ర పరిచయం నుంచి ముగించేవరకు అద్భుతంగా చూపించాడు. బావ మల్లేష్ అంటే రుద్రంగికి పంచ ప్రాణాలు. గుడి వద్దకు వెళ్లి ఒక్క మాట కూడా చెప్పకుండా మట్టి పట్టుకొని రుద్రంగి గుడిగంటను మోగించే సీన్ అద్భుతంగా ఉంది. చివరలో జగపతిబాబు చనిపోయే సన్నివేశం అద్భుతమైన ముగింపు. మమతా మోహన్ దాస్ ఫైర్‌బ్రాండ్‌లా అదరగొట్టింది. విమలా రామన్ ఫర్లేదు. ఆశిష్ గాంధీ యాక్షన్ సీన్స్‌లో చక్కగా నటించాడు. సినిమాకు సంగీతం ప్రాణం పోసింది. పాటలు అన్నీ బాగున్నాయి. క్లైమాక్స్ మాత్రం సాగదీతగా అనిపించింది. దొర గడీ, ఊరు సెట్స్ బాగున్నాయి. ఆర్ట్, కాస్య్టూమ్స్ చక్కగా ఉన్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఓకే. తెలంగాణలో రుద్రంగి మూవీ వర్కవుట్ అవుతుంది. ఏపీ జనాలు అంతగా రిసివ్ చేసుకునే అవకాశం లేదు.