»Bharateeyudu 2 Movie Review Shankar Kamal Haasan Combo Repeated
Bharateeyudu 2 Movie Review: శంకర్, కమల్ హాసన్ కాంబో రిపీట్ అయ్యిందా?
శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా సంచలనం సృష్టించింది. మళ్లీ ఇప్పుడు అదే కాంబో ఆ సినిమాకి సీక్వెల్‌గా భారతీయుడు 2 గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ వీరిద్దరి కాంబో మళ్లీ రిపీట్ అయ్యిందో లేదో తెలుసుకుందాం.
కథ
చిత్ర (సిద్ధార్థ్) తన టీమ్‌తో బార్కింగ్ డాగ్స్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూంటారు. ఇందులో అవినీతి చేస్తున్న అధికారుల గురించి తనదైన శైలిలో కార్టూన్స్ రూపంలో చూపిస్తూ చాలా పాపులర్ అవుతారు. అలాగే అవినీతి అధికారులను అరెస్టు చెయ్యాలని తన టీమ్ సభ్యులతో ధర్నాలు కూడా చేస్తుంటాడు. అయితే పోలీసులు వీళ్లను లెక్క చేయరు. ఇందులో ఒకరిని మాత్రమే అరెస్టు చేస్తారు. అయితే అవినీతి ఎలా అయిన అంతం కావాలని భారతీయుడు(కమల్ హాసన్) మళ్లి రావాలని ఒక హ్యాష్ టాగ్ వైరల్ చేస్తారు. చిత్ర స్నేహితుడు ఒకరు భారతీయుడుని తైపీ నగరంలో చూశానని చెప్తాడు. అక్కడ భారతీయుడు ఒక వ్యాపారవేత్త(గుల్షన్ గ్రోవర్) న్యూ ఇయర్ క్యాలండర్ కోసం కొంతమంది మోడల్స్‌తో సముద్రంలో చిత్రీకరణ చేస్తూ ఉంటాడు. అవినీతిపరుడైన ఆ వ్యాపారవేత్తని భారతీయుడు చంపేస్తాడు. అక్కడ నుంచి అవినీతిపరులపై భారతీయుడు వేట మొదలవుతుంది. ఇక తాను భారతదేశం వెళ్లాల్సిన సమయం వచ్చిందని చెబుతాడు. చిత్ర టీము చేసిన యూట్యూబ్ వీడియోలు అన్నింటిని చూస్తున్నానని చెప్పాడు. ఇక ఇక్కడ నుంచి భారతీయుడు, సీబీఐ అధికారి, అవినీతిపరుల మధ్య సాగే ఆటలు ఎలా సాగుతాయి? అసలు భారతీయుడు చివరికి పోలీసులకి దొరుకుతాడా? చిత్ర కుటుంబం ఎందుకు అతన్ని చీదరించుకుంది? రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ పాత్రలు ఏంటి? ఈ విషయాలు అన్ని తెలియాలంటే థియేటర్లలో సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
భారతీయుడు సినిమాలో సేనాపతి అవినీతి పరులను అంతమొందించే విధానం ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకేస్తుంది. ఆ సినిమాలో అతని కుటుంబానికి జరిగిన అన్యాయం, భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఈ భారతీయుడు 2కి వచ్చేసరికి మాత్రం యాక్షన్‌కి బదులు, భారతీయుడు చెప్పే సోది ఎక్కువయిపోయింది. అది కొంచెం ప్రేక్షకులకి అసహనంగా ఉంటుంది. దానికితోడు సినిమా మూడు గంటల నిడివి ఉండటం. భావోద్వేగాలు కనిపించవు, సినిమాలో రాబోయే సన్నివేశాలని ప్రేక్షకుడు ముందుగానే ఊహించే విధంగా ఉంటడం వలన ఆసక్తి తగ్గిపొతుంది. సినిమా మొదలవడం బాగానే ఉంటుంది. హెల్త్ ఇష్యూ, ఎడ్యుకేషన్ విభాగాల్లో అవినీతి వలన ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు అనే విషయాలు బాగా చెప్పారు. కానీ భారతీయుడు వచ్చి ఈ అవినీతి పరులని ఎలా సమాజానికి చూపిస్తాడు, ఎలా వాళ్లని దోషిగా నిలబెడతారని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. కానీ ఆ సన్నివేశాలన్నీ అంతగా ఆకట్టుకోవు. ముందు చెప్పినట్టుగా ప్రీచింగ్తో పాటు, చాలా సన్నివేశాలని సాగదీశాడు. శంకర్ సినిమా అనగానే ప్రేక్షకులు ఒక గొప్పదైన సన్నివేశాలు ఆశిస్తారు. కానీ సినిమాలో ఎక్కడా అవి కనిపించవు. 28 ఏళ్ల క్రితం భారతీయుడు సినిమాతో ఒక ట్రెండ్ సెట్ చేశారు. అయితే శంకర్ అదే లంచం, అదే అవినీతిపై ఇప్పుడు పెద్ద స్కేల్లో చెప్పాలని అనుకున్నాడు, కానీ పూర్తిగా విఫలం అయ్యాడనే చెప్పాలి. దానికితోడు చాలా సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా అనిపించాయి. ఎక్కడా సహజత్వం కనిపించదు. శంకర్ సినిమాలో వుండే అద్భుతమైన ఛాయాగ్రహణం, సంగీతం ఈ సినిమాలో లోపించాయి. ఇద్దరి కాంబో రిపీట్ కాలేదనే చెప్పవచ్చు.
ఎవరెలా చేశారంటే?
నటీనటుల విషయానికొస్తే కమల్ హాసన్ తన నటనతో మెప్పిస్తారు. అతని గొంతు రకరకాలుగా ఉంటుంది. కొన్నిసార్లు సెట్ అవుతుంది. మరికొన్నిసార్లు సెట్ కాదు. సిద్ధార్థ్ ఒక యూట్యూబర్ పాత్రలో మంచి నటన కనపరిచాడు. రెండో సగంలో అమ్మ పోయినప్పుడు చేసే సన్నివేశంలో బాగా చేసాడు. రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర అంతగా లేదు. ప్రియా భవానీ శంకర్ తన పాత్రకి తగ్గట్టుగా చేసింది. బాబీ సింహా సిబిఐ అధికారిగా బాగున్నాడు. సముద్రఖని పాత్రలో కొత్తదనం లేదు. ఎస్.జె.సూర్య కేవలం రెండు మూడు సన్నివేశాలకు పరిమితం. జాకిర్ హుస్సేన్, పీయూష్ మిశ్రా ఇంకా చాలామంది నటీనటులు కనపడతారు. అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు
టెక్సికల్గా చూసుకుంటే సాంకేతికంగా సినిమా బాగుంది. కానీ అనిరుధ్ రవిచందర్ సంగీతం అంత ఆకర్షించలేదు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కెమెరామెన్ పనితనం కూడా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. కథ పరంగా శంకర్ ఆకట్టుకున్నారు. కానీ రచన పరంగా ఆకట్టుకోలేకపోయారు.
ప్లస్ పాయింట్స్
+కమల్ హాసన్ నటన
+విజువల్స్
మైనస్ పాయింట్స్
-బోరింగ్ సన్నివేశాలు
-కథ పెద్దగా లేకపోవడం
-అనవసరపు సన్నివేశాలు
-మ్యూజిక్