Kollywood: నలుగురు హీరోలకు షాక్.. రెడ్ కార్డ్ ఇచ్చేశారు!
నలుగురు కోలీవుడ్ స్టార్ హీరోలకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. శింబు, ధనుష్, విశాల్, అధర్వల విషయంలో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నైలో జరిగిన ప్రొడ్యూసర్స్ సమావేశంలో ఈ నలుగురు హీరోలకు రెడ్ కార్డ్ ఇవ్వాలని నిర్ణయించారు.
తమిళ నిర్మాతల మండలి శింబు, విశాల్, ధనుష్, అధర్వలకు షాక్ ఇచ్చారు. నిర్మాత మైఖేల్ రాయప్పన్‌తో ఏర్పడిన వివాదాల నేపథ్యంలో శింబుకు రెడ్ కార్డు జారీ చేయనున్నారు. ఇప్పటికే ఈ వివాదంపై ఎన్నోసార్లు శింబుతో చర్చలు జరిపారు. కానీ శింబు నుంచి ఎలాంటి రెస్పాండ్ లేదు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మదియలకన్ నిర్మాణ సంస్థతో హీరో అథర్వ ఓ చిత్రానికి ఓకే చేశారని.. కానీ షూటింగ్ విషయంలో ఆయనకు ఏమాత్రం సహకరించడం లేదనే ఆరోపణలతో ఆయనకు రెడ్ కార్డు ఇవ్వనున్నట్లు చెప్పింది.
ఇక తెనందాల్ నిర్మాణ సంస్థలో ధనుష్ ఓ చిత్రానికి అంగీకరించారు. అయితే 80 శాతం షూట్ పూర్తయినప్పటికీ కూడా షూటింగ్‌కు హాజరుకాలేదని.. దాని వల్ల నిర్మాతకు నష్టాలు ఏర్పడినట్లు నిర్మాతల మండలి తెలిపింది. ఈ కారణంతోనే ధనుష్ పై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇక ప్రొడ్యూసర్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో హీరో విశాల్.. అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ.. రెడ్ కార్డు ఇవ్వనున్నట్టు తెలిపారు.
అయితే శింబు, అధర్వకు దీని వల్ల పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోయినా.. ధనుష్, విశాల్‌కు మాత్రం ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. ధనుష్‌కు పాన్ ఇండియా లెవల్లో ఫాలోయింగ్ ఉంది. విశాల్‌కు తెలుగు, తమిళ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. రేపే విశాల్ నటిస్తున్న ‘మార్క్ ఆంటోని’ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇలాంటి సమయంలో రెడ్ కార్డ్ అనే న్యూస్.. విశాల్‌ను డిస్టర్బ్ చేసినట్టే. మరి దీనిపై ఈ నలుగురు హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.