కళా తపస్వి, సీనియర్ దర్శకులు కే విశ్వనాథ్ మృతితో సినీలోకం దిగ్భ్రాంతికి లోనయింది. సినీ ప్రముఖులంతా విశ్వనాథ్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. విశ్వనాథ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92.
విశ్వనాథ్ భౌతికకాయానికి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి నివాళులు అర్పించారు. అంతకుముందే మెగాస్టార్ చిరంజీవి విశ్వనాథ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
కాశీనాథుని విశ్వనాథ్ 1930 పిబ్రవరి 19వ తేదీన గుంటూరు జిల్లాలోని రేపల్లెలో జన్మించారు. చిన్నతనం నుండి రామాయణ, మహాభారత గ్రంధాలను వింటూ, చదువుతూ అందులో ఉన్న అంశాలను అవగతం చేసుకున్నారు. డిగ్రీ పూర్తిచేసిన అనంతరం, కె విశ్వనాథ్ చెన్నైలోని వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డర్గా జీవితాన్ని ప్రారంభించారు.
ఈ తరువాత పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్డర్గా పనిచేశారు. అనంతరం దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద కొంతకాలం దర్శకత్వ శాఖలో పనిచేశారు. దుక్కిపాటి మధుసూథనరావు కె విశ్వనాథంకు ఆత్మగౌరవంతో దర్శకత్వం అవకాశం లభించింది. ఆ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ తరువాత ఎన్నో శంకరాభరణం, స్వర్ణకమలం, స్వయంకృషి, సిరివెన్నెల, స్వాతిముత్యం, స్వాతికిరణం, సాగరసంగమం వంటి ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.