ఒకప్పుడు తన అందం, నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి హేమామాలిని. సీనియర్ నటుడు ధర్మేంద్ర (Dharmendra)తో వివాహమైన తర్వాత కూడా తన ఇంట్లోనే నివసించడంపై డ్రీమ్‌గర్ల్ హేమ మాలిని (Hema Malini) ఎట్టకేలకు స్పందించారు. ఆ విషయంలో తాను బాధపడటం లేదని చెప్పారు. ప్రతి మహిళా భర్త, పిల్లలతో సంతోషంగా ఉండాలని ఆశపడుతుందని.. కాకపోతే కొన్నిసార్లు అనుకున్న విధంగా జరగదని ఆమె అన్నారు.‘‘ఒక మహిళ పెళ్లైయ్యాక కూడా తన ఇంట్లో నివసిస్తే ఫెమినిజం (Feminism) అనొచ్చు. కాకపోతే, ఇలా ఉండాలని ఎవరూ కోరుకోరు. కొన్నిసార్లు అలా జరుగుతుంది. ఏం జరిగినా సరే నువ్వు అంగీకరించక తప్పదు. లేకపోతే, ఎవరికీ తమ జీవితాన్ని కొనసాగించాలని అనిపించదు.
ప్రతి స్త్రీ కూడా భర్త కావాలని కోరుకుంటుంది.. కానీ ఎక్కడో మా బంధం దారి తప్పింది.. అని చెప్పుకొచ్చారామె. తన ఇద్దరు పిల్లల ఈషా, అహానాకి ధర్మేంద్ర తండ్రిగా ఎప్పుడూ ఉంటారని.. వారి పెళ్లిళ్లు సరైన సమయం వచ్చినపుడు జరుగుతాయని అన్నారు హేమ మాలిని.1980 లలో టాప్ ఫిల్మ్ స్టార్ (Film star) అయిన హేమ మాలినిని ధర్మేంద్ర వివాహం చేసుకున్నారు. వారికి ఈషా-అహానా ఇద్దరు పిల్లలు. సినిమాల్లోకి రాకముందే 1954 లోనే ధర్మేంద్ర.. ప్రకాష్ కౌర్‌ను 19 సంవత్సరాల వయసులో పెళ్లాడారు. వారికి సన్నీ, బాబీ, విజేత, అజీత అనే నలుగురు పిల్లలు ఉన్నారు. రీసెంట్గా సన్నీ డియోల్(Sunny Deol) కుమారుడు కరణ్ పెళ్లి జరిగింది. అయితే ఈ వేడుకకు హేమ మాలిని, ఆమె కుమార్తెలు హాజరు కాలేదు.