శౌర్యువ్ దర్శకత్వంలో నాని(Nani), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా.. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. నేడు డిసెంబర్ 7న ఈ సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో(Hi Nanna Movie Review) తెలుసుకుందాం.
నేచురల్ స్టార్ నాని ‘దసరా’ మూవీ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హాయ్ నాన్న'(Hi Nanna) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో శృతి హాసన్ గెస్ట్ రోల్ చేసింది. తండ్రి కూతుళ్ల బాండింగ్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ కావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. పైగా టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఎమోషనల్ డ్రామాగా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో(Hi Nanna Movie Review) తెలుసుకుందాం.
కథ
విరాజ్(నాని) ఫొటోగ్రాఫర్. ముంబైలో మోడల్స్‌కి ఫొటోలు తీస్తూ తన కూతురు మహి(కియారా ఖన్నా)నే జీవితం అని బ్రతుకుతుంటాడు. సరదాగా కూతురికి కథలు చెప్పడం విరాజ్‌కి అలవాటు. తన కూతురుకి ఓ అరుదైన వ్యాధి ఉండటంతో చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. మహిని చిన్నప్పటి నుంచి అమ్మ గురించి తెలియకుండా విరాజ్ పెంచాడు. మహి ఓ రోజు అమ్మ కథ చెప్పమని అడిగింది. నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తే చెబుతానని విరాజ్ అంటాడు. అమ్మ కథ కోసం కష్టపడి చదివి క్లాస్ ఫస్ట్ వస్తుంది. కానీ విరాజ్ మహికి అమ్మ కథ చెప్పడు. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అనుకోకుండా యష్న(మృణాల్ ఠాకూర్) మహికి పరిచయం అవుతుంది. మహి, యష్న మంచి స్నేహితులు అవుతారు. యష్న వల్ల విరాజ్ మహికి అమ్మ కథ చెప్పాల్సి వస్తుంది. మహి వాళ్ల అమ్మ ఎవరు? యష్న విరాజ్ లైఫ్‌లోకి వస్తుందా? మహి ఆరోగ్యానికి ఏమైంది? అనేది తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
అమ్మానాన్నల ప్రేమకథలో సాగే ఈ సినిమాలో మనస్సును హత్తుకునే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ప్రేమకథల్లోని మలుపులు కొత్తగా ఉంటాయి. అమ్మ గురించి ‘నాన్న’ నానీ చెప్పిన ఈ ప్రేమకథ చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. విరాజ్-వర్ష, విరాజ్-యష్న ఈ రెండు ప్రేమకథల్లో ఆశించిన స్థాయిలో కెమిస్ట్రీ లేదు. ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం.. గొడవలు.. విడిపోవడాలు.. ‘హాయ్ నాన్న’ కథాంశం కొత్తదేమీ కాదు. జెర్సీ, సంతోషం, సారొచ్చారు ఇలా చాలా సినిమాల్లో కనిపించే కామన్ పాయింటే ఇది. కానీ ‘హాయ్ నాన్న’లో అమ్మ పాత్రని దర్శకుడు శౌర్యువ్ మలిచిన తీరు చాలా కొత్తగా అనిపిస్తుంది. వర్ష కథ విని యశ్న విరాజ్‌తో ప్రేమలో పడటం, తర్వాత మహి ఎవరు కూతురు అనే మలుపు సినిమాకి ఆసక్తికరంగా ఉంటుంది. తండ్రీ కూతుళ్ల పాత్రలు వాళ్ల భావోద్వేగాలు ఈ సినిమాకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. సినిమా ప్రథమార్థంలో ఇక్కడి నుంచి వెళ్లిపోదాం నాన్న.. నుంచి ద్వితీయార్థంలో నువ్వు నిజమైన అమ్మవి కాదుగా అని మహి మాట్లాడే సందర్భాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. ప్రథమార్థం కాస్త బోరింగ్‌గా, సాగదీసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. చివరికి ద్వితీయార్థంలో ఉండే ట్విస్ట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే?
నటీనటుల విషయానికి వస్తే.. నాని ఎప్పట్లాగే తన న్యాచురల్ నటనతో మెప్పిస్తాడు. మృణాల్ ఠాకూర్ అందం, ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొడుతుంది. నాని కూతురుగా కియారా ఖన్నా అద్భుతంగా చేసిందనే చెప్పొచ్చు. నాని ఫ్రెండ్‌గా ప్రియదర్శి, మృణాల్ తల్లి, జయరాం తమ పాత్రల్లో మెప్పిస్తారు. శృతి హాసన్ ఓ పాటలో మెరిపిస్తుంది. దర్శకుడు శౌర్యువ్‌కి ఇది తొలి సినిమా అయిన ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. ఎక్కడా కూడా తన మొదటి సినిమా అనే ఫీలింగ్ కలగదు. తెలిసిన కథనే దర్శకుడు కొత్తగా చూపించాడు.
సాంకేతిక అంశాలు
సినిమా విజువల్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో BGM, సినిమా మొత్తం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి.