డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ మహారాజా రవితేజ.. ఈ ఇద్దరిది టాలీవుడ్లో డెడ్లీ కాంబినేషన్. ఇద్దరు కలిసి పలు బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అంతకు ముందు రవితేజ ఎన్ని సినిమాలు చేసినా.. హీరోగా నిలబెట్టింది మాత్రం పూరి జగన్నాథే. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో హీరోగా రవితేజకు హిట్ ఇచ్చిన పూరి.. ఆ తర్వాత ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలు చేశాడు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చి దాదాపు దశాబ్ద కాలం అవుతోంది. ఇప్పటి వరకు మరో ప్రాజెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు పూరి పరిస్థితి బాగాలేదు. లైగర్ సినిమా దెబ్బకు సతమతమవుతునే ఉన్నాడు. దాంతో పూరితో సినిమా చేయడానికి ఏ హీరో రెడీగా లేడనే టాక్ నడుస్తోంది. బాలయ్య, చిరు.. పూరికి ఛాన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా.. ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా లేదు. పోనీ కొడుకు ఆకాష్తో చేద్దామనుకుంటే.. పూరి సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవడానికి.. అతని ఇమేజ్ సరిపోదు. అందుకే మరోసారి రవితేజతో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఇప్పటికే పూరీ మాస్ మహారాజా రవితేజతో సంప్రదింపులు జరుపుతున్నాడని టాక్. రవితేజ కూడా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ధమాకా రిలీజ్కు రెడీ అవుతుండగా.. రావణసుర, టైగర్ నాగేశ్వరరావు సెట్స్ పై ఉన్నాయి. వీటి తర్వాత మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. అయినా కూడా పూరికి రవితేజ డేట్స్ ఇవ్వడం పక్కా అని చెప్పొచ్చు. మరి నిజంగానే మరోసారి పూరి-రవితేజ కాంబోలో సినిమా ఉంటుందా.. లేక పుకార్లకే పరిమితమవుతుందా.. అనేది చూడాలి.