NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకోవడంతో పాటు తారక్ తాజాగా మరో అరుదైన గుర్తింపు సాధించారు. ఆస్కార్ ‘యాక్టర్స్ బ్రాంచ్’లో సభ్యత్వం పొందారు. ఆస్కార్ తన కొత్త మెంబర్స్ లిస్ట్‌ని నేడు ప్రకటించింది. ఈ లిస్ట్ లో ఇండియా నుంచి ఎన్టీఆర్ స్థానం దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అకాడమీ కమిటీ తెలియజేసింది. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్‌లో తారక్ చోటు సంపాదించారు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు, ఇండియన్ సినిమాకే గర్వకారణం. ఈ ఏడాది సభ్యులుగా చేరిన ఐదుగురు నటుల పేర్లను సోషల్ మీడియా వేదికగా అకాడమీ వెల్లడించింది.
ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ కోసం అకాడమీ ప్రపంచవ్యాప్తంగా అగ్ర నటులను తీసుకోగా అందులో ఎన్టీఆర్ ఒకరిగా నిలిచారు. ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటుగా కే హుయ్ క్వాన్, మార్షా స్టెఫానీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలాజర్ వంటి ఇతర నటీనటులు ఉన్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వరించింది. ఈ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ అద్భుతమైన నటన, డ్యాన్స్‌లతో ప్రసంశలు అందుకున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌తో పాటుగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డ్స్‌లోనూ సత్తా చాటారు.
అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో సభ్యత్వానికి ఆహ్వానం పొందాలంటే కనీసం మూడు థియేట్రికల్ ఫీచర్ ఫిల్మ్‌లలో నటించాలి. వాటిలో ఒకటి గత ఐదు సంవత్సరాలల్లో విడుదలై ఉండాలి. అకాడమీ ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబించే విధంగా ఆ సినిమా ఉండాలి. ఏదో ఒక కేటగిరీలో తప్పనిసరిగా అకాడమీ అవార్డుకు నామినేట్ అయి ఉండాలి. ఇలా అన్ని అర్హతలు కలిగిన సినిమాల్లో అత్యుత్తమ నటన చేసిన నటీనటులకు మాత్రమే ‘ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్’ లో చోటు కల్పిస్తారు.