ఈసారి దసరా బాక్సాఫీస్ వార్ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మధ్య ఫిక్స్ అయిపోయిన సంగతి తెలిసిందే. రియల్ లైఫ్‌లో చిరు, నాగ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అలాంటి ఈ ఇద్దరు ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టడం ఆసక్తికరంగా మారింది. ఎవరు భారీ ఓపెనింగ్స్ రాబడతారనేది మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేశారు ఈ సీనియర్ హీరోలు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. రెండు సినిమాల ఈవెంట్లను కూడా రాయలసీమలోనే నిర్వహించడం విశేషం. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ వేడుకను.. 28న తేదిన అనంతపురంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాంతో ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నారు మెగా ఫ్యాన్స్.
ఇక బాక్సాఫీస్ దగ్గర చిరుతో సై అంటున్న నాగ్.. ఈవెంట్ విషయంలోను పోటీ పడుతున్నాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కిన ‘ది ఘోస్ట్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను.. సెప్టెంబర్ 25న కర్నూలులోని, ఎస్టిబిసి గ్రౌండ్లో సాయంత్రం 6 గంటలకు ప్లాన్ చేస్తున్నారు. దాంతో మెగాస్టార్ ఈవెంట్‌కు మూడు రోజుల ముందే రాయలసీమలో సందడి చేయబోతున్నాడు నాగ్. అలాగే ప్రమోషన్స్‌లోను దూకుడు చూపిస్తున్నాడు. అయితే ఈ ప్రీరిలీజ్ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎవరు వస్తున్నారనే విషయంలో మాత్రం సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. మరి అక్టోబర్ 5న చిరు, నాగ్ ఎలా సందడి చేస్తారో చూడాలి.