Soap Nuts : మన దేశంలో ఎప్పటి నుంచో కుంకుడు కాయల్ని సహజమైన షాంపూలా తలను శుభ్రం చేసుకోవడానికి వాడుతూ వస్తున్నారు. గత కొంత కాలంగా అంతా కుంకుడు కాయల్ని పూర్తిగా విడిచిపెట్టి రసాయనాలతో నిండిన కృత్రిమ షాంపూలను వాడుతున్నారు. అందువల్ల చాలా రకాల కేశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కుంకుడు కాయలు స్కాల్ప్ నుంచి జుట్టు చివర్ల వరకు మురికిని పూర్తిగా వదలగొట్టి శుభ్రం చేస్తాయి. అయితే వీటితో కేవలం ఇదొక్కటి మాత్రమే ఉపయోగం అనుకుంటే పొరబడినట్లే. అంతకు మించిన ప్రయోజనాలు(benefits) మనకున్నాయి. అవే ఇప్పుడు తెలుసుకుందాం రండి.
కుంకుడు కాయలు సహజంగా చేదుగా ఉంటాయి. అందువల్ల స్కాల్ప్ పైన ఫంగస్ పెరగకుండా ఉంటుంది. అందుకనే కుంకుడు కాయలతో మాత్రమే తల స్నానం చేసే వారిలో చుండ్రు సంబంధిత సమస్యలు తలెత్తవు. వీటిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల జుట్టు ఊడే సమస్యలు తగ్గుముఖం పడతాయి. సాధారణంగా కుంకుడు కాయలతో స్నానం చేస్తే జట్టు కాస్త బిరుసుగా మారుతుందని చాలా మంది భయపడుతుంటారు. వీటితో గోరింతాకును కలిపి తలస్నానం చేయాలి. అప్పుడు జుట్టు డ్రై అవ్వకుండా కాంతివంతంగా నిగనిగలాడుతూ ఉంటుంది. కొందరికి జుట్టు చివర్లు చిట్లిపోతుంటాయి. అలాంటి సమస్య ఉన్నవారు వీటితో తలస్నానం చేయడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది.
ఇంగ్లీష్‌లో కుంకుడుకాయల(Soap Nuts) రసానికి ఆల్ పర్పస్ షాంపూ అనే పేరుంది. దీన్ని జంతువులకు స్నానం చేయించడానికి, కార్లు, మోటార్ సైకిళ్లలాంటివి కడుక్కోవడానికి, ఆభరణాలు క్లీన్ చేసుకోవడానికి కూడా వాడవచ్చు. రసాయన రహితంగా ఇంటిని క్లీన్ చేసుకోవాలనుకునేవారు కాస్త కుంకుడుకాయల రసాన్ని బకెట్ నీళ్లలో వేసి ఇంటికి తడి గుడ్డ పెట్టుకోవచ్చు. సింకులు, టాయిలెట్లు, బాత్ టబ్బులు లాంటి వాటినీ శుభ్రం చేసుకోవచ్చు. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల ఇవన్నీ చక్కగా శుభ్ర పడతాయి. మొక్కలకు తెగుళ్లను నివారించే లక్షణమూ ఉంది. కొన్ని కుంకుడు కాయల్ని చితక్కొట్టి నానబెట్టి రసం తీసి వడగట్టాలి. ఆ రసాన్ని నీటిలో కలిపి మొక్కలకు స్ప్రే చేయాలి. ఇలా ఇది సహజమైన పురుగుమందుగానూ పని చేస్తుంది. రసాయన క్రీంలు వాడకూడదు అనుకునే మగవారు షేవింగ్ క్రీంలా కూడా దీన్ని వాడేయొచ్చట. అలాగే సబ్బులు వాడకుండా బట్టలు ఉతకడానికీ, సామాన్లు తోమడానికీ కూడా ఇది పనికి వస్తుంది.