మలాసనం (గార్లాండ్ పోజ్) రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేస్తే శారీరకంగా, మానసికంగా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఆసనంలో కూర్చున్నప్పుడు కడుపులోని అవయవాలపై ఒత్తిడి పడి, గ్యాస్, అజీర్తి, బ్లోటింగ్ సమస్యలు తగ్గుతాయి. ఇది పేగుల కదలికలను ఆరోగ్యంగా మార్చి, మలం సులభంగా విసర్జించబడటానికి సహాయపడుతుంది. వెన్నెముకను నిటారుగా ఉంచి ఈ ఆసనం వేయడం వల్ల నడుము, తుంటి, తొడల కండరాలు దృఢపడతాయి.
అంతర్గత ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి శరీరం చాలా కష్టపడుతుంది. బయట వేడి తీవ్రంగా ఉన్నప్పుడు అది ‘శీతల మోడ్’లోకి మారిపోతుంది. ఫలితంగా స్వేద గ్రంథులు క్రియాశీలమవుతాయి. రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. వేడిని విడుదల చేయడానికి చర్మానికి చేరువలో రక్త ప్రవాహం పెరుగుతుంది. చెమట పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. అందుకే దాహం వేస్తుంది.
ఎండలో తిరిగి వచ్చిన వెంటనే బాగా చల్లగా ఉన్న నీరు తాగితే తాత్కాలికంగా రక్తనాళాలు ముడుచుకుపోతాయి. మైగ్రేన్, సైనస్ వంటి ఇబ్బందులు ఉన్నవారిపై ప్రభావం పడొచ్చు. కొందరిలో అకస్మాత్తుగా తలనొప్పి ఉత్పన్నం కావొచ్చు. ఒకవేళ చల్లటి నీటినే తాగాలనుకుంటే.. తొలుత సాధారణ నీటితో కాళ్లు, చేతులు, ముఖాన్ని కడుక్కోవాలి. 5-10 నిమిషాల తర్వాత చల్లటి నీటిని నెమ్మదిగా తాగాలి.
గంటల తరబడి రీల్స్, షాట్స్ చూడటం వల్ల చిన్నారులు, యువతలో కంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. స్క్రీన్ వైపే చూడటంతో కనురెప్పలు ఆర్పడం తగ్గి కళ్లు పొడిబారడం, మెల్లకన్ను, నిద్రలేమి సమస్యలు వస్తున్నాయి. దీని నివారణకు స్క్రీన్ టైమ్ తగ్గించాలని, ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలోని వస్తువును చూసే 20-20-20 రూల్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కొత్త చెప్పులు కొనేటప్పుడు స్టైల్‌తో పాటు ఆరోగ్యానికీ ప్రాధాన్యమివ్వాలి. తరచూ హై-హీల్స్ వాడటం వల్ల వెన్నెముక, మోకాళ్ల నొప్పులు వచ్చే ప్రమాదముంది. నొప్పులున్నవారు ‘ఆర్థోటిక్స్’ ప్రత్యేక ఇన్సోల్స్ చెప్పులు వాడటం మంచిది. ఇవి శరీర బరువును సమతుల్యం చేసి నడకను మెరుగుపరుస్తాయి. వీటి వల్ల దీర్ఘకాలిక నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇరవైల వయసులో వచ్చే బ్రేకప్‌లను ఇప్పుడు ‘ఫ్రంటల్ లోబ్ బ్రేకప్స్’ అంటున్నారు. మన మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇరవై ఐదేళ్ల వరకు పూర్తిగా అభివృద్ధి చెందదు. ఈ వయసు దాటాక ఆలోచనల్లో పరిపక్వత వస్తుంది. అప్పుడు పాత బంధాల్లోని లోపాలు స్పష్టంగా అర్థమై యువత బ్రేకప్స్ చెబుతున్నారు. అంటే మన ఆలోచనా విధానంలో వచ్చే మార్పే ఈ బ్రేకప్‌లకు కారణం.
వేసవిలో గుడ్లు తింటే వేడి చేస్తుందని కొందరు సందేహిస్తుంటారు. అయితే కాలంతో సంబంధం లేకుండా గుడ్లను ఎప్పుడు తీసుకున్నా శరీరానికి అవసరమైన ప్రొటీన్, విటమిన్స్, ఖనిజాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లను తినడం వల్ల ఎలాంటి వేడి చేయదని, జీర్ణ సమస్యలు రావని అంటున్నారు. అయితే రోజుకు 1 లేదా 2 గుడ్లను మాత్రమే తినాలని, సరిపడినంత నీరు తాగితే సరిపోతుందని సూచిస్తున్నారు.
జీవవైవిధ్యం మానవాళిని రక్షించే ఓ సహజ రక్షణ కవచం. అయితే వాతావరణ మార్పులు, కాలుష్యం, ప్రకృతి దోపిడీ వంటి చర్యలు ప్రపంచాన్ని నాశనం చేసే దిశగా తీసుకెళ్తున్నాయి. దీన్ని అధిగమించేందుకు జీవవైవిధ్య పునరుద్ధరణకు అంతా నడుం బిగించాలి.
లవంగాలు తెల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడతాయి. అలాగే జీవిత కాలాన్ని పెంపొందించే గుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి. ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం లభించడానికి లవంగం నమలడం ఉపకరిస్తుంది. కడుపులో గ్యాస్ ఏర్పడకుండా ఇది చూస్తుంది. నోట్లో లవంగం ముక్క ఉంచుకొని మెల్లగా నమలడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.
టీ కాఫీల్లో చక్కెర లేకుండా తాగడం వలన డయాబెటిస్ ముప్పు ఉండదు అనుకోవడం సహజం. చక్కెర వాడకాన్ని తగ్గించడం వలన కొంత ఉపయోగం ఉండవచ్చు కానీ.. ఇతర రోజూవారి అలవాట్లు చక్కెర వ్యాధికి దారితీసే అవకాశం ఉంది. డయాబెటిస్ అంటే కేవలం షుగర్‌తో వచ్చేదే కాదు.. లైఫ్‌లో మనం ఎలా ఉంటాం.. ఎంత సేపు కూర్చుంటాం.. ఎంత సేపు పడుకుంటాం.. ఎంత స్ట్రెస్ ఉంది.. అనే అంశాలపై ఆధారపడి డయాబెటిస్ ఉంటుంది.
వేసవిలో వడదెబ్బ తగిలినప్పుడు చర్మం ఉపరితలానికి సమీపంలో రక్తం ప్రసరించే చోట్ల.. అంటే మెడ మీద.. చంకలు, గజ్జల్లో.. మణికట్టు లోపలి భాగం వద్ద తడి బట్ట లేదా ఐస్ ప్యాక్ పెట్టటం మంచిది. ఇది ప్రసరిస్తున్న రక్తాన్ని నేరుగా చల్లబరుస్తుంది. మూల ఉష్ణోగ్రత బాగా తగ్గుతుంది. తడి తువ్వాలును పెట్టి, ఫ్యాన్ వేస్తే ఇంకా మంచిది.
చిన్న చిన్న హోటళ్లు నడిపేవారు కాగిన నూనెను పారబోయటానికి ఇష్టపడరు. మళ్లీ మళ్లీ దాన్నే ఉపయోగిస్తారు. ఇలాంటివారి కోసం FSSAI, కేంద్ర ప్రభుత్వం రుకో (రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్) అనే పథకాన్ని తీసుకొచ్చింది. వాడిన నూనెను ఏజెంట్ల ద్వారా సురక్షితంగా సేకరించి, దాన్ని బయోడీజిల్‌గా మార్చటం దీని ఉద్దేశం. ఇలా సేకరించే నూనెకు కొంత డబ్బు కూడా చెల్లిస్తారు.
కొవ్వు మనిషిని, మనసును లొంగదీసుకుంటుంది! ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. కొవ్వుతో వంటకాల రుచి పెరుగుతుంది. పదార్థాలను మృదువుగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేయటం ద్వారా నోరూరేలా చేస్తుంది. వేపుళ్ల వంటి పదార్థాలను ఎక్కువగా, మాటిమాటికి తినటానికి ఇదీ ఒక కారణమే. అందుకే దీన్ని ఒకరకంగా వ్యసనమనీ చెప్పుకోవచ్చు.