Power Saving Tips : కరెంటు బిల్లుతో కంగారా? ఈ టిప్స్ మీ కోసమే
ఎండలు పెరుగుతున్నాయంటే దాదాపు అన్ని ఇళ్లల్లోనూ ఏసీలు, ఫ్యాన్ల వాడకం పెరిగిపోతుంది. దీంతో ఎండాకాలం కరెంటు బిల్లంటేనే చాలా మందికి గాబరాగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలతో మీ కరెంటు బిల్లును తగ్గించుకోవచ్చు. అవేంటంటే...
Power Saving Tips : అసలు అంతకంతకూ విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. దానికి తోడు ఎండా కాలం వచ్చిందంటే కరెంటు బిల్లు ఎంత వస్తుందా? అని అందరికీ కంగారుగా ఉంటుంది. ఫ్యాన్లు, ఏసీలు ఎంత తక్కువ వాడదామనుకున్నా.. కుదరదన్నట్లు ఉంటుంది వాతావరణం. దీంతో చేసేదేమీ లేక బాధ పడుతూనే బిల్లు కడుతూ ఉంటాం. అయితే కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఈ బిల్లులు కాస్తైనా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పగటి పూట లైట్ల వాడకాన్ని నిలిపివేయాలి. వెలుతురు కోసం కిటికీలు, గుమ్మం తలుపుల్ని తీసి పెట్టుకోవాలి. అలాగే ఫ్రిజ్(fridge), ఏసీల్లాంటి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుక్కునేప్పుడే జాగ్రత్త పడాలి. కాస్త ఎక్కువ రేటైనా 5 స్టార్ లేదా ఇన్వర్టర్ అని ఉన్న వాటినే కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాలి. అలాగే ఛార్జర్లు, ఎలక్ట్రిక్ వైర్లలాంటి వాటివి నాణ్యమైనవే వాడుకోవాలి.
సాధారణ లైట్ల స్థానంలో ఎల్యీడీలను(LED) అమర్చుకోవాలి. ఇంట్లో గీజర్లు, ఏసీ, మిక్సీల్లాంటివి ఎక్కువగా కరెంటును ఉపయోగిస్తాయి. కాబట్టి వీటిని వాడేప్పుడు కరెంటును కాస్త దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే ఏసీలు వాడే గదుల నుంచి కూలింగ్ బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. అందుకు ఆ గదిని పూర్తిగా ఇన్సులేటెడ్గా ఉంచుకోవాలి. అలాగే సోలార్ ఎనర్జీని వాడేందుకు ప్రయత్నించాలి. ఫ్రిజ్ని మాటి మాటికీ తెరవకూడదు. ఫ్రీజర్లో ఉష్ణోగ్రత 4 నుంచి ఐదు డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి. ఇదొక్కటే మనింట్లో అన్ని వేళలా ఆన్ అయి ఉంటుంది. కాబట్టి దీన్ని కొనుక్కునేప్పుడు ఇన్వర్టర్ ఫ్రిజ్(inverter fridge) కొనుక్కోవడం ఉత్తమం.