ప్రపంచంలో జనాభా విస్ఫోటనం భారీగా ఉంది. కానీ చైనాలో మాత్రం అతి తక్కువగా ఉంది. చైనాలో అమలు చేసిన విధానాలతో ఆ దేశంలో జనాభా పెరుగుదల భారీగా తగ్గింది. త్వరలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం హోదాను చైనా కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ స్థానంలో భారతదేశం నిలువనుంది. అయితే జనాభా తగ్గుదలపై డ్రాగన్ దేశం ఆందోళన చెందుతోంది. మరణాలతో పోలిస్తే జననాలు స్వల్పంగా ఉండడంతో నివారణ చర్యలు చేపట్టింది. దీనికోసం దేశంలో అమలు చేస్తున్న విధానాలను సంస్కరించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో పెళ్లి కాకుండానే పిల్లలు కనొచ్చు అనే విధానం తీసుకువచ్చింది.
ఈ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో మాత్రమే అమల్లోకి తీసుకువచ్చారు. జనాభా తగ్గుదల కలవరం పెట్టడంతో సిచువాన్ ప్రావిన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెళ్లి కాని వారు కూడా చట్టబద్ధంగా పిల్లల్ని కలిగి ఉండడానికి అనుమతి ఇచ్చింది. వీరికి వివాహితులు పొందే ప్రయోజనాలన్నీ దక్కుతాయి. ఫిబ్రవరి 15 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని అక్కడి అధికారులు ప్రకటించారు. వివాహం కాని ఒంటరి వ్యక్తి పిల్లలు కావాలనుకుంటే సంబంధిత అధికారుల వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ఎంతమంది పిల్లలు అనే విషయంలో పరిమితం ఏమీ లేదు. ఎంత మంది పిల్లలు ఉన్నా ఏం కాదు. దీర్ఘకాలిక, సమతుల్యతతో కూడిన జనాభా అభివృద్ధిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని సిచువాన్ ఆరోగ్య కమిషన్ పేర్కొంది.