పెళ్లిచూపులకు వెళ్లగా.. తనను వివాహం చేసుకోవడానికి అమ్మాయి నిరాకరించడంతో ఓ యువకుడు మనస్తాపం చెందాడు. ఆమె తిరస్కరించడాన్ని తట్టుకోలేక కాళేశ్వరం గ్రావిటీ కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నాన్నా.. ఓ పెళ్లి కోసం పరకాల వెళ్తున్నా’ అని ఇంట్లో చెప్పేసి కారులో వెళ్లిన యువకుడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ సంఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. చెన్నూర్ మండలం మందపురం గ్రామానికి చెందిన గుండా తిరుపతిరెడ్డి, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సింగరేణి ఉద్యోగి కావడంతో భూపాలపల్లిలో స్థిరపడ్డారు. వీరి చిన్న కుమారుడు వినోద్ రెడ్డి (29) హైదరాబాద్ లో మెడికల్ రిప్రజెంటెటివ్ గా పని చేస్తుండేవాడు. ఇటీవల వినోద్ రెడ్డికి ఓ సంబంధం చూశారు. వివాహం చేద్దామని కుటుంబసభ్యులు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో అమ్మాయితో ఫోన్లు మాట్లాడడం కూడా మొదలుపెట్టాడు. అయితే అకస్మాత్తుగా ఆ యువతి అతడితో పెళ్లికి నిరాకరించింది. దీంతో వినోద్ మనస్తాపం చెందాడు. అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నాడు.
నిశ్చితార్థం జరుగుతుందని భావిస్తున్న సమయంలో అమ్మాయి తిరస్కరించడంతో వినోద్ బాధపడ్డాడు. భూపాలపల్లికి శనివారం వచ్చిన వినోద్ ఉదయం 10 గంటలకు పెళ్లికి పరకాల వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం కుటుంబసభ్యులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అయితే ఇంటి నుంచి నేరుగా కాళేశ్వరం గ్రావిటీ కాల్వ వద్దకు చేరుకుని కారును, తాళం చెవి, ఫోన్ అక్కడే వదిలేశాడు. వెంటనే కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడి స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాల్వలో జాలర్లతో గాలించిగా ఆదివారం సాయంత్రం యువకుడి మృతదేహం లభించింది.