హమాస్ మిలిటెంట్లు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఎదరు దాడి చేసింది. ఇరుదేశాల నడుమ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారతీయ పౌరులకు ఇండియన్ ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
War Between Israel and Hamas Indian Embassy Advisory to Indians
IsraelVsHamas: ఇజ్రాయిల్, హమాస్ దేశాల నడుమ యుద్దవాతరణం నెలకొంది. దీంతో ఇజ్రాయెల్ దేశంలో పరిస్థితులు ఆందోళనగా మారాయి. తమ దేశంపై మెరుపుదాడికి దిగిన హమాస్ మిలిటెంట్ల (Hamas militants)ను ఇజ్రాయెల్ (Israel) దీటుగా ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్‌లోని భారత పౌరుల(Indians)కు అక్కడి భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు సూచించిన భద్రతా ప్రొటోకాల్స్‌ను పాటించాలి. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. సురక్షిత శిబిరాలకు చేరువగా ఉండండి. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ సిబ్బందిని సంప్రదించండి అని టెల్ అవివ్‌లోని భారత దౌత్యకార్యాలయం (Indian embassy) తమ అడ్వైజరీలో పేర్కొంది. గాజాలోని హమాస్ మిలిటెంట్లు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగారు. ఇజ్రాయెల్‌పైకి వేల కొద్దీ రాకెట్లను పంపించడమేగాక, వారి భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. వీధుల్లో తిరుగుతూ కాల్పులు జరుపుతున్నారు. వీరి దాడిని ఇజ్రాయెల్ సైన్యం ప్రతిఘటిస్తోంది. హమాస్ మిలిటెంట్లపై ఎదురు కాల్పులకు దిగింది. అటు గాజాలోని హమాస్ స్థావరాలపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో ఇజ్రాయెల్, పాలస్తీనా వ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది.
1967లో మధ్యప్రాచ్యం యుద్ధం తర్వాత ఇజ్రాయెల్(Israel) తూర్పు జెరూసలెంను తమ అధీనంలోకి తీసుకుని ఈ మొత్తం నగరాన్ని రాజధానిగా భావించింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. పాలస్తీనా.. తూర్పు జెరూసలెంను వేరుగా చూస్తోంది. ఈ భూభాగం తమదే అంటున్న యూదులు పాలస్తీనియన్లను అక్కడి నుంచి తరిమికొట్టడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అంతకంతకూ వివాదం రాజుకుంటోంది. 2016 అక్టోబర్‌లో ఒక వివాదిత తీర్మానాన్ని ఆమోదించిన ఐక్యరాజ్యసమితి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ జెరూసలెంలోని చారిత్రక అల్-అక్సా మసీదుపై యూదులకు ఎలాంటి హక్కు లేదని చెప్పింది. మరోవైపు యూదులు దానిని టెంపుల్ మౌంట్ అని చెబుతున్నారు. దానిని యూదులకు అత్యంత ముఖ్యమైన మతపరమైన స్థలంగా భావిస్తారు. అప్పటి 2017లో ముసలం మొదలై ఇప్పటి వరకు అది రాజుకుంటూనే ఉంది.