Rambabu Vs Nagabau: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు(Nagabau), ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వీరిద్దరి నడుమ సోషల్ మీడియా యుద్ధం జరుగుతోంది. సిద్ధం సభలో జగన్ మాట్లాడిన తీరుపై అటు టీడీపీ శ్రేణులు, ఇటు జనసేన శ్రేణులు తమదైన శైలీలో స్పందించారు. చాలా మంది వ్యంగస్త్రాలు వేశారు. దీనిలో భాగంగా నాగబాబు కూడా విమర్శించారు. భీమిలిలో నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… “పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడిని కాదు… అర్జునుడ్ని” అంటూ వ్యాఖ్యానించారు.
ఆ మాటలపై నాగబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ… “వెంకటేశ్వరస్వామి ప్రసాదాలు టిష్యూ పేపర్లో చుట్టి పక్కనపెట్టే మీకెందుకండీ రామాయణ, మహాభారత ఉదాహరణలు” అంటూ దెప్పిపొడిచారు. దీనిపై జనసేన శ్రేణులు సైతం పెద్దఎత్తున కామెంట్లు చేశారు. దీనిపై నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. “పవిత్ర దీపారాధనతో సిగరెట్ ముట్టించుకునే మీకెందుకు సార్ ఈ ఉదాహరణలు!” అంటూ నాగబాబును ట్యాగ్ చేశారు. దీంతో ఇరు వర్గాల నడుమ ఎక్స్ వేదికగా వార్ నడుస్తుంది.