ఇజ్రాయెల్ కు గూఢచర్యం చేశారనే ఆరోపణలతో ఖతార్ ప్రభుత్వం భారత్‌కు చెందిన ఎనిమిది మంది మాజీ కెప్టన్లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో వీరికి మరణశిక్షను ఖతార్ ప్రభుత్వం విధించింది.
Qatar: గత కొన్ని నెలలు నుంచి భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులు ఖతార్ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేస్తూ దొరికిన ఎనిమిది మంది భారతీయ నౌకాదళ మాజీ అధికారులకు ఖతార్ మరణశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై చాలా బాధను కలిగించిందని భారత విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖతార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని.. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది.
భారత నేవీ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్‌ను 2022 ఆగస్టు 30న ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేశారు. వీళ్లు ప్రైవేట్ సంస్థ దహ్రా గ్లోబల్ సంస్థలో పనిచేస్తున్నారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళం అధికారి నిర్వహిస్తున్నారు. అక్కడ పనిచేసిన వీరంతా ఇజ్రాయెల్‌కు గూఢచారులుగా వ్యవహరించారని ఖతార్ ఆరోపించింది. ఆ ఆరోపణల కింద అభియోగాలను మోపి.. చివరకు మరణశిక్ష విధించింది.
ఎనిమిది మంది భారత మాజీ నౌకాదళ అధికారుల తరుఫున ఎన్నోసార్లు చేసిన బెయిల్ అభ్యర్థనలను ఖతార్ కోర్టు తిరస్కరించింది. వీళ్లంతా భారత్ అధికారులతో మాట్లాడారు. భారత విదేశాంగ శాఖ ఖతార్ ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిపింది. చాలాసార్లు బెయిల్ కోసం ప్రయత్నించారు. వీరి నిర్బంధాన్ని ఖతార్ ప్రభుత్వం చాలాసార్లు పొడిగించింది. చివరకు ఖతార్ ప్రధాన కోర్టు ఎనిమిది మంది భారత మాజీ నౌకాదళ అధికారులకు మరణ శిక్ష విధించింది. దీనిపై ఖతార్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగ శాఖ స్పష్టంచేసింది.