భారత్ జీ20 సదస్సుకు హోస్ట్‌గా వ్యవహరిస్తోందని, ఇలాంటి సమయంలో భారత్ తన శాంతి ఫార్ములాను ముందుకు తీసుకు వెళ్లాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ సంభాషణ సందర్భంగా సూచించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో జీ20 సదస్సు జరగనుంది. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా, జెలెన్స్కీ… మోడీతో ఫోన్లో సంభాషించారు. అనంతరం ఆయన ఫోన్ ద్వారా మాట్లాడినట్లు ట్వీట్ చేశారు. తాను ప్రధాని మోడీతో ఫోన్లో సంభాషించానని, జీ20 మీ ఆధ్వర్యంలో విజయవంతం కావాలని విష్ చేశానని చెప్పారు. అదే సమయంలో భారత శాంతిమంత్రాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని తాను విజ్ఞప్తి చేశానని, అలాగే, ఐక్య రాజ్య సమితిలో మద్దతుకు తాను కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు. గతంలో జీ20 వేదిక నుండి తాను శాంతి సూత్రాన్ని ప్రతిపాదించానని, దీని అమలుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో భారత్ పైన తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.
ఉద్రిక్తతలకు కళ్లెం వేసి, వెంటనే యుద్ధాన్ని విరమించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా ప్రధాని మోడీ కూడా ఈ సందర్భంగా జెలెన్స్కీకి సూచనలు చేశారు. ఇరుదేశాలు చర్చలు ప్రారంభించి, విబేధాలను పరిష్కరించుకోవాలన్నారు. శాంతి ప్రయత్నాల్లో ఎలాంటి సాయానికైనా సిద్ధమని, బాధిత ప్రజలకు మానవతా సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఉక్రెయిన్‌లో చదువుకుంటూ తిరిగి దేశానికి వచ్చిన విద్యార్థుల విద్యాభ్యాసం కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జెలెన్స్కీతో ఫోన్ సంభాషణలకు సంబంధించి ప్రధాని మోడీ కార్యాలయం కూడా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇరుదేశాల అధినేతలు ద్వైపాక్షిక సహకారాన్ని బలోపంతే చేసుకునే అవకాశాలపై చర్చించారని, ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్ నుండి తిరిగి రావాల్సిన భారత విద్యార్థుల విద్య కోసం ఏర్పాట్లను సులభతరం చేయాలని ఉక్రెయిన్ అధికారులను ప్రధాని కోరారని పేర్కొంది.