వైట్ హౌస్(White House)లో తనకు లభించిన ఆత్మీయ స్వాగతం ..140 కోట్ల భారతీయులకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ (PM MODI) తెలిపారు. 3 దశాబ్దాల క్రితం ఓ సామాన్యుడిలా అమెరికా (America) పర్యటనకు వచ్చి వైట్ హౌస్‌ను బయటినుంచి చూశానున్నారు. ఇప్పుడు ప్రధానిగా వస్తే పెద్ద ఎత్తున జన నీరాజనాలతో తొలిసారి వైట్ హౌస్ ద్వారాలు తెరుచుకున్నాయి అని ప్రధాని మోదీ తెలిపారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఘనస్వాగతం లభించింది. మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) దంపతులు స్వయంగా స్వాగతించారు. 19 తుపాకులతో సాయుధ సైనికులు మోదీకి గౌరవ వందనం సమర్పించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. బైడెన్ దంపతులు ఇచ్చిన ఆతిథ్యాన్ని మోదీ స్వీకరించారు. అయితే పురాతన అమెరికన్ బుక్ గ్యాలీతో పాటు పాతకాలపు అమెరికన్ కెమెరాను మోదీకి బైడెన్ బహూకరించారు.
మరోవైపు, జిల్ బైడెన్‌కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారు.మోదీ, బైడెన్ కాసేపట్లో ఇరు దేశాల సంబంధాలపై సంయుక్త ప్రకటన చేయనున్నారు. రక్షణ రంగం(Defense sector), నూతన సాంకేతికతలు, ఆరోగ్య రంగం, పర్యావరణం, వీసాలు, అత్యవసర సేవల రంగాలు తదితర అంశాల్లో పరస్పర సహకారంపై ఒప్పందాలను కూడా ఈ సమావేశంలో వెల్లడించనున్నారు.కాగా, మోదీ వైట్ హౌస్ లో అడుగుపెట్టిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ… అమెరికా, భారత్ మధ్య బంధం 21వ శతాబ్దంలో కెల్లా అత్యంత అర్థవంతమైనదని అభివర్ణించారు. ఇరు దేశాల రాజ్యాంగాల్లోని మొదటి మాడు మాటలు ‘వుయ్ ద పీపుల్’ (‘We the People’)అనే ఉంటాయని, రెండు సార్వభౌమ దేశాలను కలిపి ఉంచే అంశం ఇదేనని తెలిపారు.