»Passing Torch To New Generation To Unite Country Joe Biden
Joe Biden : కొత్త తరానికి అవకాశం ఇచ్చేందుకే బరి నుంచి తప్పుకున్నా : బైడెన్
రెండోసారి అధ్యక్ష పదవిని అలంకరించే సామర్థ్యం తనకు ఉంది గానీ కొత్త తరానికి అవకాశం ఇచ్చేందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోంచి వైదొలిగానని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఆయన ఈ విషయమై ఏం మాట్లాడారంటే?
Joe Biden : అమెరికాలో డెమాక్రాటిక్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలవకుండా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆయన తాజాగా స్పందించారు. కొత్త తరానికి అవకాశం ఇచ్చేందుకే తాను బరి నుంచి వైదొలిగినట్లు తెలిపారు. తనకు రెండో సారి కూడా అధ్యక్షుడిగా పని చేయడానికి సామర్థ్యం ఉందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. అయితే క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని ఏకం చేయాల్సిన బాధ్యత తనపైన ఉందని గుర్తు చేసుకున్నారు. అందుకనే తాను ప్రస్తుత ఉపాధ్యక్షురాలు అయిన కమల హారిస్(kamala harris) అధ్యక్ష అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు.
దేశాన్ని ఏకతాటిపై నడపడానికి, నిరంకుశత్వం నుంచి కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని బైడెన్(Joe Biden) అన్నారు. పరోక్షంగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌పై విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా పని చేయడం తనకు జీవితంలో లభించిన గొప్ప అనుభవం అంటూ చెప్పుకొచ్చారు. తనకు అధ్యక్ష కార్యాలయంపై చాలా గౌరవం ఉందని చెప్పారు. అయితే అంతకంటే ఎక్కువగా తాను దేశాన్ని ప్రేమిస్తున్నానన్నారు. అందుకనే కమలాహారిస్ని అధ్యక్ష అభ్యర్థిత్వానికి తగిన వ్యక్తిగా తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే విషయంలో ఏదీ అడ్డు రాకూడదని తాను భావిస్తున్నట్లు చెప్పారు.