»Kamala Harris Vows To Defeat Trump And Saying Thanks To Biden
US Elections : ట్రంప్‌ని ఓడించడమే నా లక్ష్యం : కమలాహారిస్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ విషయమై ఆమె ఏం మాట్లాడారంటే?
US Elections 2024 : అమెరికా ప్రస్తుత ఉపాధ్యక్షురాలైన కమలాహారిస్ డెమాక్రాటిక్ పార్టీ తరఫున తదుపరి అధ్యక్ష అభ్యర్థి అని వార్తలు వెలువడుతున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్ నవంబర్‌లో జరగనున్న అమెరికా ఎన్నికల బరి నుంచి పలు కారణాలతో తప్పుకున్నారు. తాను కమలాహారిస్(KAMALA HARRIS) అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పరిణామాలపై కమలా హారిస్ సైతం స్పందించారు. తనకు మద్దతుగా నిలిచిన బైడెన్‌కు(BIDEN ) ధన్యవాదాలు తెలిపారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు. ఈ విషయమై ప్రజలను ఏకం చేస్తానంటూ చెప్పుకొచ్చారు.
దేశ అధ్యక్షుడిగా ప్రజలకు బైడెన్ చేసిన సేవలు వెల కట్టలేనివని అన్నారు. అందుకు దేశ ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు హారిస్(HARRIS) తెలిపారు. తాను ఆయనలో దేశభక్తి, సహృదయం, చిత్తశుద్ధి లాంటి మంచి లక్షణాలను చూసినట్లు చెప్పారు. ఎప్పుడూ ఆయన దేశ ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. తనకు ఆయన మద్దతుగా నిలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. డెమాక్రాటిక్ పార్టీ తరపున నామినేషన్‌ను దక్కించుకుని ట్రంప్‌పై గెలుపొందడమే తన లక్ష్యం అని కమల హారిస్ అన్నారు. అయితే డెమాక్రాటిక్ పార్టీలో అభ్యర్థిత్వ రేసులో మరి కొందరి పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. బైడెన్, క్లింటన్ల మద్దతు లభించడం హారిస్‌కు కలిసొచ్చే విషయమే. అయినప్పటికీ ఆగస్టు 19న షికాగోలు ఆ పార్టీ సదస్సులో ఈ విషయంపై తుది నిర్ణయం వెల్లడి కానుంది.