ఓ 64 ఏళ్ల వ్యక్తి దగ్గినందుకు జైలు శిక్ష పడింది. ఈ సంఘటన సింగపూర్‌లో చోటుచేసుకుంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తికి కోర్టు రెండు వారాల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీసుల కథనం మేరకు..తమిళ్ సెల్వం అనే భారతీయ సంతతికి చెందిన వ్యక్తి సింగపూర్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో కోవిడ్ టెస్టులు చేశారు. ఆ పరీక్షలో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.
తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని తెలిపేందుకు ఆ వ్యక్తి లాజిస్టిక్ కార్యాలయానికి చేరుకున్నాడు. అయితే తమిళ సెల్వంను ఇంటికి వెళ్లిపోవాలని ఆఫీసు సిబ్బంది సూచించారు. అయినప్పటికీ ఆ వ్యక్తి అక్కడే తిరుగుతూ తన సహ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందికి గురిచేశాడు. దగ్గుతూ అక్కడే తిరుగడంతో అక్కడున్నవారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు.
ఈ కేసును పరిశీలించిన కోర్టు ఉద్యోగుల వాదనలు వింది. సింగపూర్ లో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండు వారాల పాటు భారతీయ సంతతి వ్యక్తి తమిళ సెల్వంకు జైలు శిక్షను విధించింది. ఆఫీసులో చాలా సేపు దగ్గుతూ ఉన్నందుకు ఆ శిక్షను వేసినట్లు కోర్టు తెలిపింది. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.