ఇప్పటి వరకూ 100 గ్రాములు లేదా 200 గ్రాముల బరువు ఉండే ఉల్లిగడ్డను చూశాం. కానీ బ్రిటన్లో ఓ రైతు ఏకంగా 9 కిలోల బరువున్న ఉల్లిగడ్డను పండించాడు. వ్యవసాయ చరిత్రలో ఈ ఘటన సంచలనం రేపింది. గ్వెర్న్సే ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల రైతు గారెత్ గ్రిఫిన్ ఆ భారీ స్థాయి ఉల్లిపాయను పండించాడు. దీని ద్వారా ఆ వ్యక్తి ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. ఆరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షోలో ఆ భారీ ఉల్లిగడ్డను ప్రదర్శించాడు. ఇది ప్రపంచ రికార్డు అని హారోగేట్ ఫ్లవర్ షో వెల్లడించింది.
ఆ రైతు పండించిన ఉల్లిగడ్డ 8.9 కిలోల బరువు ఉండగా, పొడవు 21 అంగుళాలు ఉంది. ఆ ఉల్లిగడ్డను పండించటానికి ఆ రైతు 12 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. ఉల్లిగడ్డ సాగుకు అదనపు లైటింగ్, ఆటోమేటిక్ ఇరిగేషన్ వంటి ప్రత్యేక చర్యలతో పండించినట్లు బ్రిటన్ రైతు గారెత్ గ్రిఫిన్ తెలిపాడు. ఈ భారీ ఉల్లిగడ్డను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇంకా గుర్తించాల్సి ఉందని అన్నారు. గ్రిఫిన్ తండ్రి కూడా పెద్ద సైజు ఉల్లిగడ్డలను గతంలో సాగు చేసేవాడని, సరైన విత్తనాలు, సరైన సాగు విధానాలతోనే ఇలాంటివి సాధ్యమవుతాయని ఆయన తెలిపారు.