తాను మళ్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 2024 లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి వైట్‌హౌస్ పీఠాన్ని దక్కించుకునేందుకు రేసులో ఉంటానని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల పోటీ కోసం అమెరికా ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‌కు పత్రాలు సమర్పించారు.
ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. అయినా ట్రంప్ ఏ మాత్రం తగ్గడం లేదు. తమ పార్టీ మరింత బలపడిందని, అమెరికన్ల కలను సాకారం చేసి తీరతానని అన్నారు. అందుకే మళ్లీ పోటీలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
“అమెరికాను మరింత సమోన్నతంగా, కీర్తిమంతంగా తీర్చిదిద్దడంలో భాగంగా అధ్యక్ష ఎన్నికల్లో నా అభ్యర్థిత్వాన్ని నేడు ప్రకటిస్తున్నా” అని ట్రంప్ వెల్లడించారు. అమెరికన్ల కలలను కాపాడడంలో ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు.