Chile Forest Fires: దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశాన్ని కార్చిచ్చు దహించివేస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు చెలరేగాయి. ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ఈ మంటల్లో ఇప్పటివరకు 46 మంది మృతి చెందగా.. వేలాది మందికి గాయాలు అయ్యాయి. గాయాలు అయిన వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటివరకు దాదాపు 1,100 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వాల్పరైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు.
మంటలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయని.. వాటిని అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ.. పరిస్థితులను మరింత దయనీయంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంటల తీవ్రత అధికంగా ఉన్న వాల్పరైజో ప్రాంతం నుంచి ఇప్పటికే వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. ప్రస్తుతం చిలీ వ్యాప్తంగా 92 ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగగా.. 43 వేల హెక్టార్లలో అడవులు ప్రభావితమైనట్టు మంత్రి చెప్పారు.
ఇక, తీరప్రాంత పర్యాటక నగరం వినా డెల్ మార్లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, కార్చిచ్చు ప్రాంతాలకు చేరుకోవడం రెస్క్యూ సిబ్బందికి కష్టంగా మారిందని అధికారులు చెప్పారు. గత దశాబ్ద కాలంలో దేశంలో చెలరేగిన కార్చిచ్చుల్లో అత్యంత దారుణమైనది ఇదేనని చిలీ డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది. ఇక, చిలీలో కార్చిచ్చు సర్వసాధారణం. గతేడాది అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా 4 లక్షల హెక్టార్ల మేర అడవులు దగ్దమయ్యాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాదితో పోల్చితే ఇది తక్కువ విస్తీర్ణమైనా.. ప్రాణనష్టం అధికంగా ఉంది