ఈ మధ్యకాలంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ గురించి ఎక్కువగా వార్తలు వినపడుతున్నాయి. దీనిలో భాగంగానే రీసెంట్ గా బాలీవుడ్ హీరో రణబీర్‌కు సమన్లు జారీ చేసినట్టుగా ఈడీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 6వ తేదీన రణబీర్ కపూర్ ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆయనకు జారీ చేసిన సమన్లలో పేర్కొన్నారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాల ప్రకారం.. రణబీర్ కపూర్ ఒక సబ్సిడరీ యాప్‌ను ప్రమోట్ చేశారు. దీనిని మహాదేవ్ బుక్ యాప్ ప్రమోటర్లు కూడా ప్రమోట్ చేశారు. ఈ ప్రమోషన్ కోసం రణబీర్ కపూర్ నగదు రూపంలో డబ్బు తీసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఈ యాప్ గురించి పలు విషయాలు బయటకు వచ్చాయి. ఈ యాప్ ప్రమోటర్, నిందితుడు సౌరభ్ చంద్రకర్.. ఈ ఏడాది దుబాయ్‌లోని రాస్ అల్ ఖైమాలో రూ.200 కోట్లు ఖర్చుచేసి ధూం ధాంగా పెళ్లిచేసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వేడుకల్లో దాదాపు 17మంది బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నట్టు దర్యాప్తులో తేలింది.
టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, నేహా కక్కర్, అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, అలీ అస్గర్, విశాల్ దడ్లానీ, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, కృతి కర్బందా, నుష్రత్ భరుచ్చా, కృష్ణ అభిషేక్, గాయకులు సులీ, నేహా కక్కర్ తదితరులు ఈ వేడుకలకు హాజరైనట్టు గుర్తించారు. దీంతో వీరందరికీ ఈడీ సమన్లు పంపేందుకు సిద్ధమవుతోంది. ఈ కేసుకు సంబంధించిన దేశవ్యాప్తంగా కోల్‌కతా, భోపాల్, ముంబై వంటి నగరాల్లో 39 ప్రాంతాల్లో ఈడీ సోదాలను నిర్వహించి, రూ.417 కోట్ల నగదుతో పాలు పలు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకుంది.
ఈ క్రమంలోనే దుబాయ్ వేదికగా ఫిబ్రవరిలో జరిగిన సౌరభ్ చంద్రకర్ వివాహ వేడుకకు పలువురు బాలీవుడ్ నటులు , గాయకులు హాజరైన విషయం బయటపడింది. ఈడీ చేతికి చిక్కిన సాక్ష్యాలను బట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి హవాలా ద్వారా రూ. 112 కోట్లు, హోటల్ బుకింగ్‌ల కోసం రూ. 42 కోట్లు చెల్లించారు. అంతేకాదు వివాహానికి కుటుంబ సభ్యులను నాగ్‌పూర్ నుంచి దుబాయ్‌కి ఛార్టెడ్ ఫ్లైట్లలో తీసుకెళ్లినట్టు తేలింది. అలాగే, ముంబై నుంచి వెడ్డింగ్ ప్లానర్లు, డ్యాన్సర్లు, డెకరేటర్లు మొదలైన వారిని తీసుకెళ్లారని వెల్లడయ్యింది.