»A Kilo Of Tomato Has Reached 30 Paise Farmers Are Crying
Tomato Prices: 30 పైసలకు చేరిన కిలో టమోటా..కన్నీళ్లు పెడుతోన్న రైతులు!
ఒకప్పుడు రూ.300కు పైగా ధర పలికిన కిలో టమాటా ధర ఇప్పుడు 30 పైసలకు చేరుకుంది. కనీస ధరను ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఓ కప్పు టీ తాగడానికి కూడా 30 కిలోల టమాటాలు అమ్మాల్సి వస్తోందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఆ మధ్య టమాటా ధరలు (Tomato Prices) భారీగా పెరగడంతో వినియోగదారులు, ప్రభుత్వాలు గగ్గోలు పెట్టుకున్నాయి. ధరను తగ్గించడంలో ప్రభుత్వాలు చర్యలు కూడా తీసుకున్నాయి. కిలో రూ.300లకు పైగానే చేరడంతో కొందరు రైతులు కోట్లు సంపాదించారు. కొందరైతే రూ.3 కోట్లు, రూ.4 కోట్ల వరకూ సంపాదించి రికార్డు క్రియేట్ చేశారు. అయితే అదంతా అప్పుడు. ఇప్పుడు పరిస్థతి మారిపోయింది.
తాజాగా కిలో టమాటాలు 30 పైసలకు పడిపోయాయి. కొన్ని రోజులుగా టమాటా సప్లై బాగా పెరిగింది. దీంతో టమాటాకు డిమాండ్ బాగా తగ్గింది. ధర దారుణంగా పడిపోవడంతో టమాటా రైతులకు కనీసం రవాణా ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదు. కనీస ధర కూడా రాకపోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. మార్కెట్ యార్డులో కిలో టమాటాలు 30 పైసలకు పలకడంతో రైతులు ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు. గురువారం కర్నూలు జిల్లా (Kurnool District)లోని పత్తికొండ మార్కెట్ యార్డులో కిలో టమాటా 30 పైసలకు చేరుకుంది. మార్కెట్లో కప్పు టీ తాగడానికి కూడా 30 కిలోల టమాటాలు అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే రిటైల్ మార్కెట్లో (Retail Market) చూస్తే టమాటా కిలో రూ.20కి అమ్ముతున్నారు. హోల్ సేల్ మార్కెట్లో మాత్రం వ్యాపారులు కనీస ధర కూడా ఇవ్వడం లేదని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వారం రోజుల క్రితమే టమాటా రైతులను (Tomato Farmers) ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు టమాటా పంటను కొనుగోలు చేస్తుందని అధికారులు తెలిపారు.
ఆ హామీని ఇప్పుడు గంగలో కలిపేశారని రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. కిలో 30 పైసలకు మించి ధర రాకుంటే మార్కెట్ యార్డు (Market yard) అధికారులు చూస్తూనే ఉంటున్నారని, ఎటువంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ పంటను కొనుగోలు చేయాలని టమాటా రైతులు డిమాండ్ చేస్తున్నారు.