గత 24 గంటల్లో దాదాపు 700 మంది ఉక్రెయిన్ (Ukrain) జవాన్లు హతమార్చినట్లు రష్యా (Russia) రక్షణ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్, రష్యా దేశాలకు మధ్య పరస్పర దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో ఉక్రెయిన్ దేశానికి సంబంధించిన పలు ఆయుధ డిపోలు, హోవిట్జర్లు, పలు వాహనాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది.
మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) భారత ప్రధాని మోదీ (Pm modi)కి ఫోన్ చేసి కీలక అంశాలను చర్చించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సు, ద్వైపాక్షిక సహకారం వంటి అంశాల గురించి మోదీ, పుతిన్ చర్చలు జరిపారు. కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ నెలలో ఇండియాలో జరగనున్న జీ20 సమ్మిట్‌కు తాను రాలేకపోతున్నట్లు పుతిన్ తెలిపారు. రష్యా తరపున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరుకానున్నట్లు వెల్లడించారు.
ఏడాదిన్నరగా రష్యా (Russia), ఉక్రెయిన్ (Ukrain) దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) ఆరోపణలు చేసింది. పుతిన్ అరెస్ట్ కోసం వారెంట్‌ను కూడా జారీ చేయడంతో ఆ అరెస్ట్ భయం వల్లే పుతిన్ విదేశాలకు ప్రయాణించడం లేదనే వాదన వినిపిస్తోంది.