»179 People Buried At The Same Time Gaza Hospital Like Cemetery
Gaza: దారుణం..ఒకేసారి 179 మందిని ఖననం..శ్మశానవాటికలా గాజా ఆస్పత్రి
గాజాలోని షిఫా ఆస్పత్రిలో ఒకేసారి 179 మందిని సామూహిక ఖననం చేశారు. ఇందులో చిన్నపిల్లలు సైతం ఉన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇప్పటికీ ఇజ్రాయెల్ తన ప్రతీకార చర్యలకు పాల్పడుతూనే ఉంది. దీంతో హమాస్ ఉగ్రవాదుల్లో బలమైన నాయకులంతా మృతిచెందారు. ఇప్పుడు హమాస్ ఉగ్రవాదులను నడిపించేవారే లేకపోవడంతో ఇజ్రాయెల్ గాజా సిటీని ఆక్రమించుకుంది. నేడు గాజా సిటీలోని హమాస్ పార్లమెంట్ భవనంలోకి ఇజ్రాయెల్ సైన్యం ప్రవేశించింది. పార్లమెంట్ భవనంపై ఇజ్రాయెల్ జెండాను ప్రదర్శించింది. దీంతో ఇజ్రాయెల్ త్వరలోనే గాజా భూభాగం మొత్తాన్ని తమ హస్తగతం చేసుకోనున్నట్లు ప్రకటించింది.
ఇకపోతే తాజాగా గాజాలోని ఆస్పత్రి వద్ద జరిగిన ఓ సంఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఆస్పత్రిలో 179 మందిని సామూహిక ఖననం చేశారు. ఈ విషయాన్ని అల్ షిఫా హాస్పిటల్ చీఫ్ మహమ్మద్ అబూ సల్మియా వెల్లడించారు. ఆస్పత్రి కాంపౌండ్ లోనే సామూహిక ఖననం చేశారని, అందులో శిశువులను కూడా పాతిపెట్టినట్లుగా ఆయన తెలిపారు. ఆస్పత్రిలో ఫ్యూయల్ సరఫరా నిలిచిపోవడం వల్ల ఇంటెన్సివ్ కేర్లో ఉన్నటువంటి ఏడుగురు పసికందులు, 29 మంది రోగులు చనిపోయారని, వారందరినీ కూడా ఆస్పత్రి ఆవరణలోనే ఖననం చేసినట్లు వెల్లడించారు.
తాజాగా ఆ ఆస్పత్రికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏడుగురు శిశువులను ఒకే దగ్గర కట్టివేసి ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన తర్వాత షిఫా ఆస్పత్రి ఓ శ్మశానవాటికలా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆస్పత్రి వద్ద మృతదేహాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయని, దుర్గంధంతో ఆ ప్రాంతం మొత్తం భీకరంగా మారిందని డబ్ల్యూహెచ్వో తెలిపింది.