భారత్-చైనా మధ్య ఈ నెల 9వ తేదీన జరిగిన ఘర్షణ విషయంలో అగ్రరాజ్యం అమెరికా భారత్ వైపు నిలిచింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత్ తీసుకునే ప్రతి చర్యకు తాము మద్దతు ఇస్తామని అమెరికా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో ఎల్ఏసీ వెంబడి భారత్-చైనా ఘర్షణను యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ డిఫెన్స్ పరిశీలిస్తోందని పెంటగాన్ తెలిపింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా బలగాలు నిత్యం ఎల్ఏసీ వెంట తచ్చాడటం, సైనిక, మౌలిక సదుపాయాలను నిర్మించడాన్ని చూసినట్లు తెలిపింది. ఈ మేరకు పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ పాట్ రైడర్ ప్రెస్ రిలీజ్ చేశారు. భారత్కు అండగా ఉంటామని తెలిపారు.
తవాంగ్ సెక్టార్లో వాస్తవాదీన రేఖ వెంట 9వ తేదీన భారత్ – చైనా మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇరుపక్షాలు గాయపడ్డాయి. ఈ మేరకు భారత సైన్యం ఇటీవల ప్రకటన విడుదల చేసింది. 300 చైనీస్ ట్రూప్స్ ఎల్ఏసీ వద్దకు వచ్చాయని తెలిపింది. తమ కుట్రలో భాగంగా 17000 అడుగుల ఎత్తు కలిగిన పర్వతాన్ని కంట్రోల్లోకి తీసుకునేందుకు చైనా ప్రయత్నించింది. అయితే భారత భద్రతా దళాలు వారి కుట్రలను తిప్పికొట్టాయి. 2020 జూన్లో గాల్వాన్ లోయలో జరిగిన ఘటన తర్వాత చైనా-భారత సైన్యం మధ్య పెద్ద ఘర్షణ వాతావరణం ఇదే మొదటిసారి.
ఈ ఘటనపై చైనా కూడా ఆ తర్వాత ప్రకటన ఇచ్చింది. ప్రస్తుతం భారత సరిహద్దుల్లో పరిస్థితులు చక్కబడ్డాయని తెలిపింది. చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ పరిస్థితి స్టేబుల్గా ఉందని, డిప్లమోటిక్, మిలటరీ ఛానల్స్ ద్వారా చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా, ఈ ఘటనలో గాయపడినవారిలో భారత్ కంటే చైనా సైనికులే అధికమని తెలుస్తోంది. ఘర్షణ జరిగిన సమయంలో అక్కడ పెద్ద ఎత్తున పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సభ్యులు ఉండగా, భారత్కు చెందిన మూడు యూనిట్లు అక్కడ ఉన్నట్లుగా తెలుస్తోంది.