Weight Loss : వ్యాయామాలంటే బద్ధకమా? పడుకుని చేసే వ్యాయామాలు ప్రయత్నించండి!
బరువు పెరిగిపోవడం అనేది ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఆహార నియమాలు పాటించాలన్నా, కఠినమైన వ్యాయామాలు చేయాలన్నా చాలా మందికి కష్టంగా ఉంటుంది. అలాంటి వారు చక్కగా పడుకుని వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గించుకోవచ్చు. ఎలాగంటే...
బరువు ఎక్కువగా ఉండటం వల్ల లేని పోని ఆరోగ్య సమస్యలు అన్నీ వచ్చి పడతాయి. అందుకనే చాలా మంది బరువును ఎలాగోలా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉపవాసాలు చేస్తారు. ఇంటర్మిటెన్ పాస్టింగ్లు చేస్తారు. వ్యాయామాలు, కసరత్తులతో చమటోడ్చి మరీ ఎలాగోలా బరువును తగ్గించుకుంటారు. అయితే కొంత మందికి మాత్రం అటు తిండిని నియంత్రించుకోవడమూ కష్టంగానే ఉంటుంది. ఇటు వ్యాయామాలు చేయాలన్నా బద్ధకంగా ఉంటుంది. ఇలాంటి లేజీగా ఉండే వారు కూడా తేలిగ్గా చేసుకోగల వ్యాయామాల్ని నిపుణులు ఇక్కడ పంచుకుంటున్నారు. చక్కగా పడుకుని మరీ ఈ వ్యాయామాల్ని చేసేసుకోవచ్చని అంటున్నారు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం.
హ్యాపీ బేబీ పోజ్ :
చిన్న పిల్లలు ఆనందంగా కేరింతలు కొడుతున్నప్పుడు వారు ఒక రకమైన పోజ్(Baby pose)లో పడుకుంటారు. నేలపై వెల్లకిలా పడుకుని కాళ్లని చేతులతో పట్టుకుని నోట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. గుర్తొచ్చిందా? అచ్చంగా అలాంటి భంగిమలోనే కాసేపు ఉండాలి. కాళ్లను ఛాతీ దగ్గరకు తెచ్చుకుని చేతులతో వాటిని పట్టుకుని వీలైనంత సేపు అలా ఉండాలి. కావాలనుకుంటే 20, 30 సెకెన్లకు ఒకసారి కాళ్లను నిదానంగా చాపుకుని మళ్లీ ప్రయత్నించవచ్చు. అందువల్ల పొట్ట నరాలపై ఒత్తిడి కలుగుతుంది. ఫలితంగా అక్కడ కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలు పెడుతుంది. దీన్ని మంచం మీద విశ్రాంతిగా పడుకున్నప్పుడు కూడా మధ్య మధ్యలో చేసుకుంటూ ఉండొచ్చు.
ప్లేంక్స్ :
గట్టిగా ఉండే పరుపు మీద పడుకుని ఉన్నా ప్లేంక్స్(Planks) చేసుకోవడానికి వీలవుతుంది. ముందు బోర్లా నిదానంగా పడుకోవాలి. తర్వాత కాలి వేళ్లు, మోచేతుల దగ్గర నుంచి చేతుల వరకు నేలకు ఆనించి, మిగిలిన శరీరం అంతటినీ గాల్లోకి లేపాలి. అలా నిమిషం పాటు ఉండేందుకు ప్రయత్నించాలి. తర్వాత మళ్లీ సాధారణంగా పడుకోవాలి. ఇలా రోజుకు 20 వరకు ప్లాంక్స్ని సాధన చేయవచ్చు. అయితే మరీ మెత్తగా ఉండే పరుపుల మీద దీన్ని చేయడం కష్టం అవుతుంది.
ఇవి చేయడం వల్ల శరీరం ఎలా కావాలంటే అలా కదులుతుంది. క్యాలరీలూ కరుగుతాయి.