మనలో చాలా మంది మాంసాహారాలను ఎక్కువగా ఇష్ట పడేవారే. చికెన్, మటన్, చేప… ఇలా రకరకాల మాంసాలను తినేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే వీటిని తినేప్పుడు పక్కనే కూల్ డ్రింకులు, పండ్లు… లాంటివి పెట్టుకుని చాలా మంది తింటూ ఉంటారు. వీటితో పాటు కలిపి తినకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయి. అవి వీటితో తినడం వల్ల మన ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపిస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. అలా వీటితో కలిపి తినకూడని ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు : సముద్రపు ఉత్పత్తులను ఆహారంలో భాగంగా తీసుకునేప్పుడు పాలతో చేసిన పదార్థాలనుగాని, నేరుగా పాలనుగాని తీసుకోకూడదు. చేపలు, రొయ్యలు లాంటి వాటిలో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. పాలల్లోనూ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఇవి రెండూ కలిపి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అరుగుదల తగ్గుతుంది.
టమోటాలు : కోడి మాంసాన్ని తినేప్పుడు ఆమ్ల లక్షణాలు ఎక్కువగా ఉండే కూరగాయల్ని వీటితో కలిపి చేర్చకూడదు. ముఖ్యంగా టమోటాల్లాంటివన్న మాట. వీటిలో ఆమ్ల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని మాంసం కూరల్లో మన దగ్గర సర్వ సాధారణంగా వాడుతూ ఉంటారు. ఇలా ఇవి రెండూ కలిపి తినడం వల్ల శరీరంపై ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.
ఛీజ్ : మాంసాహారాల్లో చేపల్ని తినేప్పుడు వాటితో పాటుగా ఛీజ్‌ని తినకూడదు. అలాగే తీపి వేసిన సాస్‌లను కూడా మాంసాహారలతో కలిపి తినకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. వీటి వల్ల పొట్ట సంబంధిత సమస్యలే కాకుండా మధుమేహ ప్రమాదమూ పెరుగుతుంది.
నిమ్మ జాతి పండ్లు : చాలా మంది మాంసాహారాలను తిన్నప్పుడు నిమ్మకాయ పిండుకుంటూ ఉంటారు. అలాగే వీటితో పాటు నిమ్మజాతి పండ్లను, పుచ్చకాయ లాంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం అంత మంచిది కాదు. మరీ ముఖ్యంగా గ్రిల్డ్ చికెన్ లాంటివి, వేపించిన ఫ్రైలు తింటున్నప్పుడు. ఈ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల మాంసాహారం రుచీ మారిపోతుంది. పొట్టకూ అంత మంచిది కాదు.